Sourav Ganguly: మనదేశంలో క్రికెట్ కు, రాజకీయాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది . కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ అనుయాయులు బీసీసీఐ చైర్మన్ గా నియమితులవుతారనే అపవాదు ఉంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసన్ చైర్మన్ గా కొనసాగే వారు. ఆ తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చిన తనకు అనుకూలురైన వ్యక్తులకే బీసీసీఐ చైర్మన్ లుగా ఉండేలా తెరవెనుక పావులు కదిపింది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రారంభిస్తే.. బీజేపీ కొనసాగిస్తున్నది. ఇక మొన్నటి దాకా బీసీసీఐ చైర్మన్ గా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ ఇక ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. అక్టోబర్ 18న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా తదుపరి అధ్యక్షుడిగా కొనసాగేందుకు 1983 ప్రపంచ కప్ విన్నర్ రోజర్ బిన్నీ కి మార్గం సుగమమయింది. ఇటీవల బిసిసిఐ పెద్దలు ఢిల్లీ వేదికగా సమావేశమయ్యారు. నామినేషన్లపై చర్చించారు. రోజర్ బిన్నీని తదుపరి అధ్యక్షుడిగా కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించారు. దీంతో గంగూలీని పదవిని వదులుకోవాలని సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడాలని, లేదా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే
పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు.. మమత బెనర్జీని ఎదుర్కొనేందుకు బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రోజులు అవి. ఆ సమయంలోనే ఆమె అనుచరుడిని బిజెపి తన పార్టీలోకి లాగేసుకుంది. అయితే ఈ బలం సరిపోదని భావించి సౌరవ్ గంగూలీని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంప్రదించారు. కానీ ఈ ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. దీంతో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ గంగూలీ బిజెపిలో చేరి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అయితే గంగూలీ కి తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే ఆయన అమిత్ షా ఆఫర్ తిరస్కరించినట్టు సమాచారం. దీన్ని మనసులో పెట్టుకున్న అమిత్ షా.. తెర వెనుక గంగూలికి పొమ్మన లేక పొగబెట్టే ప్రయత్నాలు చేశారు. ఇందుకు తన కుమారుడు జై షా ను తురుపు ముక్కగా వాడుకున్నట్టు సమాచారం.
దాదా విఫలమయ్యాడా
బీసిసిఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విఫలమయ్యాడని, బోర్డు కార్యకలాపాల్లో సక్రమంగా పాల్గొనడం లేదని సభ్యులు గత కొంతకాలం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకే అధ్యక్షుడిగా ఉన్నారని, ఏ బాధ్యత కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఇటీవల కొంతమంది అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. “డాక్టర్ రాసింది పెరుగన్నమే. రోగి తినాలి అనుకున్నది పెరుగన్నమే” అనే సామెత తీరుగా అమిత్ షా వెంటనే తన ప్రణాళికను అమల్లో పెట్టారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్రానికి చెందిన రోజర్ బిన్ని ని తెరపైకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయన అనుకున్నట్టుగానే ఇప్పుడు తదుపరి అధ్యక్షుడిగా బిన్ని ఎన్నిక కాబోతున్నారు. అద్భుతం జరిగితే తప్ప రోజర్ అధ్యక్షుడు కావడం ఇక లాంచనమే. మరోవైపు బిజెపి రాజకీయాలకు దాదా బలయ్యాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. జై షా సెక్రటరీగా కొనసాగేందుకు లేని ఇబ్బంది.. మాజీ కెప్టెన్ అయిన దాదా ప్రెసిడెంట్ గా కొనసాగితే వచ్చే కష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సహకరించనందు వల్లే అతడికి పొమ్మన లేక పొగ పెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే అతడిని బీసీసీఐకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు.

నామినేషన్లు సంప్రదాయం మాత్రమే
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ గా కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ చైర్మన్ గా బ్రిజేష్ పటేల్ కొనసాగుతున్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకుడు ఆశీష్ శెలార్ కోశాధికారి బాధ్యత స్వీకరించనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ సన్నిహితుడు దేవజిత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించనున్నాడు. అయితే బుధవారం దాకా కొత్త కార్యవర్గంలో వివిధ పదవులకు పోటీపడేవారి నామినేషన్లు స్వీకరిస్తారు. 14 తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 15న తుది జాబితాలో ఉన్నవాళ్ల పేర్లను బిసిసిఐ ప్రకటిస్తుంది. కాగా ఇప్పటికే ఎవరెవరికి ఏఏ పదవులు కట్టబెట్టాలో నిర్ణయం జరిగిపోయింది. ఈ నామినేషన్లు అనేవి కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి బిసిసిఐ మీద బిజెపి పెత్తనం కొనసాగిస్తుంది అని చెప్పడానికి దాదాకు ఉద్వాసన పలకడమే నిదర్శనమని క్రికెట్ మాజీ క్రీడాకారులు చెప్తున్నారు.