Mahashivratri 2022: భారతదేశంలో దైవభక్తి మెండు. దేవుడి మీద భక్తితో మనం నిత్యం పూజలు చేస్తుంటాం. భజనలు చేస్తూ భక్తిలో ధ్యానం చేస్తుంటాం. దేశంలో ఆలయాలు కూడా కోకొల్లలు. ఆధ్యాత్మిక చింతనతో ప్రజలు నిత్యం దేవాలయాలను దర్శిస్తుంటారు. కోరుకున్న కోరికలు తీరాలని వేడుకుంటుంటారు. అంతేకాకుండా దెయ్యాలు పోవాలని కూడా దేవాలయాలకు వెళ్తుంటాం. కానీ మన దేశంలో ఉన్న ఆలయాల్లో వింతలు, విశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసుకుందాం.
రాజస్తాన్ లోని డౌస జిల్లాలోని మహందీపూర్ బాలాజీ దేవాలయంది ఓ ప్రత్యేకత. ఇక్కడ దెయ్యాలు పోవాలని భక్తులు నిత్యం వేలాది మంది దర్శిస్తుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులకు శరీరంపై వేడి నీరు పోస్తారు. తలకిందులుగా వేలాడదీస్తారు. ప్రసాదం పెట్టరు. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లడం ఇక్కడి ఆచారం. దీంతో ఇక్కడకు వచ్చే భక్తులకు దెయ్యాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.

అస్సాం రాష్ట్రంలోని గౌహతి లో నీలాచల్ కొండలపై నెలవైన కామాఖ్య దేవి ఆలయం ఉంది. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారి యోని ఆలయంగా వెలసిందని చెబుతారు. అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తుంటారు. వర్షాకాలంలో అమ్మవారు రుతుక్రమం మొదలవుతుందని, ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. తరువాత నాలుగో రోజు తెరిచిన తరువాత అమ్మవారికి ఎరుపు వస్త్రాలు సమర్పిస్తుంటారు. ఇది ఇక్కడి ప్రధాన ఆచారం.
Also Read: బీజేపీలోకి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి? సునీత సంచలన వాంగ్మూలం?

మధ్యప్రదేశ్ లోని మరో ఆలయం దేవ్ జీ మహారాజ్ దేవాలయం. ఇక్కడ కూడా దెయ్యాలు, దుష్టశక్తులు పోవాలని భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. దెయ్యాలను వదలగొట్టడానికి అరచేతిలో కర్పూరం వెలిగించి వదిలేస్తారు. దెయ్యం పట్టిన వారిని గుడి చుట్టూ పరుగెత్తిస్తూ చీపురుతో కొట్టడం చేస్తుంటారు. ప్రతి ఏటా భూత్ ఉత్సవం పేరుతో భూత్ మేళా, దెయ్యాల ఉత్సవం నిర్వహిస్తుంటారు.
వారణాసి నగరంలోని భైరవ్ నాథ్ ఆలయంది మాత్రం విచిత్ర ఆచారం. ఇక్కడ దేవుడికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయం బయట కూడా మద్యం అమ్ముతుంటారు. దీంతో భక్తులకు కూడా తీర్థం రూపంలో మద్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే అన్ని దేవాలయాల్లో మద్యం ఓ దురాచారం అయితే ఇక్కడ మాత్రం అదే ఆచారం కావడం గమనార్హం.

కేరళలోని కొడంగల్లూరు లోని భగవతి ఆలయంలో కూడా ఓ విచిత్రమైన ఆచారం ఉంది. ఇక్కడ మహిళలు, పురుషులు కత్తులతో తలలపై కొట్టుకుని రక్తం కారే విధంగా చేస్తూ అదే అమ్మవారిని పచ్చిబూతులు తిడుతుంటారు. అంతే కాదు భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి విసురుతుంటారు. దీంతో ఇక్కడ నెలకొన్న అమ్మవారికి ఇలా పూజలు చేస్తుంటారు.

ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రహ్మ దేవుడికి ఆలయం లేదు. కానీ రాజస్తాన్ రాష్ట్రంలోని పుష్కర్ ప్రాంతంలో బ్రహ్మదేవుడి ఆలయం ఉండటం విశేషం. ఔరంగజేబు హిందూ దేవాలయాలన్నింటిని ధ్వంసం చేసినా ఇది మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దీంతో బ్రహ్మదేవుడి ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని దేవరగట్టు లో కూడా ఓ వింత ఆచారం ఉంది. ఇక్కడ దసరా సందర్భంగా పురుషులందరు రాత్రంతా కర్రలతో కొట్టుకుని రక్తం చిందిస్తుంటారు. శివుడు రాక్షసుడిని సంహరించిన సందర్భంలో చిందిన రక్తం కారణంగానే ఇక్కడ 100 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం.
Also Read: పార్టీ గెలిస్తే తొలి సంతకం దాని మీదే అంటున్న రేవంత్.. కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటుందా..?