
Rama Navami 2023: భార్యాభర్తల అన్యోన్యతకు, బంధానికి ప్రతిరూపం సీతా రాములే.. ఎన్ని తరాలు, యుగాలు దాటినా ఆ జంటే నేటి తరానికి ఆదర్శం.. ఇందుకు కారణం 14 ఏళ్లు అరణ్యవాసంలో ఒకరికొకరు దూరమైనా ప్రేమా నురాగాల్లో ఇసుమంతైనా తగ్గనీయలేదు. నేటికీ భార్యాభర్తల బంధమంటే సీతారా ముల్లా కలిసుండాలని పెద్దలు సైతం ఆశీర్వదిస్తారు. అంతటి అపురూపమైన ఆ జంట కల్యాణాన్ని ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకొని, తమ భక్తి భావాన్ని చాటుకుంటారు. ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి అరుదైన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించాలని అనుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
నాటి నుంచి నేటి వరకు ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, పట్టణాలు, నగరాల్లో, విదేశాల్లో సైతం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరుపుకోవడం సంప్రదా యంగా మారింది. హిందూ ధార్మిక వ్యవస్థలో భార్యాభర్తల బంధానికి ప్రత్యేక చిహ్నంగా నిలిచే ఈ కల్యాణాన్ని తిలకించి అక్షింతలు తాము వేసుకుంటే ఈ జన్మలోనే కాదు మరు జన్మలో సైతం తాము సీతారాముల జంటలా ఉండాలని అధిక శాతం మంది భక్తులు భావిస్తారు. అందుకే రామయ్య కల్యాణ తలంబ్రాలకు ఎక్కడా లేని విశిష్టతఉంది. కల్యాణానికి ముందు తలంబ్రాలను కలిపే సమ యంలో సైతం ముత్తయిదువులు ఈ తంతులో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
కల్యాణం జరిగేది ఇలా…
తొలుత భద్రాద్రి రామాలయంలో మూలవరులకు ప్రత్యేక అలంకరణ నిర్వహిం చి కల్యాణం ఏకాంతంగా చేస్తారు. అనంతరం మంగళవాయిద్యాలు మోగుతుండగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పల్లకిలో కల్యాణ మండపానికి స్వామి తరలి వస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం చేసి, కల్యాణానికి ఉపయోగించే సకల వస్తు సామగ్రికి సంప్రోక్షణ చేస్తారు. తరువాత రక్షాబంధనం, మోక్షబంధనం అనంతరం ఎనిమిది మంది శ్రీవైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యా వరణం చేస్తారు. తరువాత వధూవరుల ఇరు వంశాల గోత్రాలను పఠించి స్వామి పాద ప్రక్షాళన అనంతరం పరిమళ భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. ఈ మహాసంకల్పానికి అను గుణంగా కన్యాదానం జరుగుతుంది.

అభిజిత్ లగ్నం సమీపించగానే…
అనంతరం మంగళవాయిద్యాలు మారు మోగుతుండగా వేద మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఆ తరువాత మాంగల్య పూజలో మంగళసూత్రాలతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో తయారయ్యే మంగళ సూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు. మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు సంకేతాలు. సూత్రంలో గౌరీదేవిని, సూత్ర మధ్యంలో సరస్వతిని, సూత్ర గ్రహంలో మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు. ఆ ముగ్గురమ్మలను ఆవాహన చేసిన మంగళ సూత్రాలలో భక్తరామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింపజేయడంతో మంగళసూత్రధారణ పూర్తవుతుంది. ఆ తర్వాత శ్రీ వైష్ణవ సం ప్రదాయాన్ని ఆచరించి గోదాదేవి శ్రీరంగనాథుడితో కల్యా ణం జరిగినట్లు కలగన్న వైవాహిక స్వప్నం వారణమాయిరం అన్న పది తమిళ పద్యాలు పాడుతూ అర్చక స్వాములు బంతులాట ఆడతారు. అనంతరం సీతారా ములకు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలలో సీతారాములకు ఆశీర్వ చనం ఇవ్వడంతో ఈ కల్యాణ క్రతువు పూర్తవుతుంది.