No Parking Problem : ప్రతి ఒక్కరి జీవితంలో నో చెప్పడం కంటే ఎస్ చెప్పడం వల్లే అన్ని పనులు సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉందని కొందరు అనుభవజ్ఞులు తెలుపుతున్నారు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా విషయం చెప్పేటప్పుడు నెగటివ్గా కాకుండా పాజిటివ్గా చెప్పడం వల్ల కూడా సరైన విధంగా అర్థమవుతుందని దీని సారాంశం. ఈ విషయాన్ని ఒక ఇంటి యజమాని బాగా అర్థం చేసుకొని ఎదుటివారి మనస్తత్వాన్ని మార్చేశాడు. తన ఇంటి ముందు ఏర్పడిన పార్కింగ్ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఒక వినూత్న ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతో సమస్య పరిష్కారం అయింది. ఇంతకీ ఆ యజమాని చేసిన ఆలోచన ఏంటి? అతడు ఎదుర్కొన్న సమస్య ఏంటి?
పట్టణాలు లేదా నగరాల్లో స్థలం తక్కువగా ఉండే రోడ్లు, ఇరుకు నివాసాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో వాహనాల పార్కింగ్ చాలా కష్టంగా మారుతుంది. అయితే కొందరు ఇతరుల ఇంటిముందు వాహనాలు పార్కింగ్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల కొందరు ఇంటి గేటుకు ‘నో పార్కింగ్’అని బోర్డులు పెట్టినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరికొందరు’నో పార్కింగ్.. ఫైన్ రూ.100’అని ఏర్పాటు చేసిన కూడా వినడం లేదు. ఈ విషయంలో చాలామంది మధ్య గొడవలు కూడా జరిగాయి.
అయితే ఓ ఇంటి యజమాని బాగా ఆలోచించి ఈ సమస్య పరిష్కారానికి వినూత్వంగా ఆలోచించాడు. అతడు కొన్ని రోజుల తర్వాత తన ఇంటి ముందు’Parking Available Rs 100 For 1 hour’ అని బోర్డు పెట్టాడు. అప్పటినుంచి అతని ఇంటి ముందు ఎవరు వాహనాలు నిలపడం లేదు. అయితే ఒక వ్యక్తికి నో అని చెప్పడం కంటే ఎస్ అని చెప్పడం వల్ల విషయం పూర్తిగా అర్థమయి అతడు మరోసారి తప్పులు చేయకుండా ఉంటారని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.
మన జీవితంలో కూడా చాలా విషయాల్లో సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే బదులు ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏ విధంగా ప్రయత్నించాలి.. అని ఆలోచించాలి. అంతేకాకుండా ఉద్యోగులు కార్యాలయాల్లో తమకు ఎంత బాధ్యతలు అప్పగించిన కూడా వాటిని వదలకుండా ఎస్ అని చెప్పి దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఇదే విషయాన్ని పిల్లల విషయంలో కూడా పాటించవచ్చు. ఒక పనిని ఎందుకు చేయాలో.. ఎందుకు చేయకూడదు చెబితే వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.