
One Husband – Two Wives: హిందూ వివాహ చట్టంలో రెండు పెళ్లిళ్లు చెల్లవు. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యతో చట్టప్రకారం విడాకులు తీసుకుని ఉండాలి, లేదా ఏదైనా కారణంతో మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లికి చట్టబద్ధత ఉంటుంది. కానీ, మొదటి భార్య ఉండగానే, రెండో పెళ్లి చేసుకుంటే చట్టప్రకారం నేరం. అయితే ఇక్కడో ఫ్యామిలీ కోర్టు ఓ భర్త రెండు పెళ్లిళ్లను అంగీకరించడమే కాకుండా ఏ భార్యతో ఎన్ని రోజులు ఉండాలో కూడా సూచించింది.
ఒకే భర్త కోసం ఇద్దరు భార్యల గొడవ..
ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవ పడగా.. ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను సమానంగా విభజించింది మధ్యప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు. గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హరియాణాలోని మల్టీనేషనల్ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. 2020లో కరోనా కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ విధించారు. దీంతో ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి పంపించాడు. లాక్‌డౌన్ ఎత్తివేసినా సరే ఆ వ్యక్తి తన భార్యను తీసుకెళ్లకుండా హరియాణా వెళ్లాడు. అనంతరం అదే కంపెనీలో పని చేస్తున్న మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

భర్త రాకపోవడంతో..
భర్త వచ్చి తనని తీసుకెళ్తాడని ఎదురుచూసిన మొదటి భార్య ఓపిక నశించి.. హరియాణాకు వెళ్లింది. అప్పుడే తన భర్త మరో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలిసింది. న్యాయం చేయాలంటూ.. మొదటి భార్య గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 6 నెలలపాటు వారికి కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు ముగ్గురితో చర్చలు జరిపిన కౌన్సెలర్ హరీశ్‌దివాన్.. సయోధ్య కుదిర్చారు. ఈ నిర్ణయాన్ని అతడి ఇద్దరు భార్యలు అంగీకరించారు. భర్త వారంలో మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండో భార్యతో ఉండాలని, ఆదివారం భర్త ఇష్టమని ముగ్గురి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కోర్టుకు నివేదించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి కూడా దీనికి ఓకే చెప్పారు.
చెరో ప్లాట్‌లో పెట్టిన భర్త..
కోర్టు తీర్పుతో ఊరట పొందిన ఇంజినీర్ భర్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదే ఆనందంతో సదరు భర్త ఇద్దరు భార్యలకు చెరో ప్లాట్ కొనిచ్చాడు. ఇద్దరూ కలవకుండా చెరో ప్లాట్‌లో పెట్టాడు. ఎందుకంటే రెండు జుట్ల కలిసి ఉంటాయి కానీ.. రెండు కొప్పులు కలిసి ఉండవని సదరు హస్బెండ్ గారు ముందే గ్రహించినట్లున్నారు. అందుకే ఇద్దరూ కలవకుండా వేర్వేరుగా ఉంచారు. మరి ఈ నారీ నారీ నడుమమురారి సంసారం ఎలా సాగుతోందో చూడాలి మరి!