Lulu Mall In Hyderabad: భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నిలుస్తోంది. వివిధ రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ టాప్ 10లో చోటు దక్కించుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. హైదరాబాద్ లోని జీవన విధానం, మార్కెట్ విలువలు హై రేంజ్ లో ఉండడంతో పాటు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడంతో చాలా మంది బిజినెస్ మ్యాగ్నేట్స్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇప్పటిక అమెజాన్ లాంటి బడా సంస్థలు హైదరాబాద్ లో తిష్ట వేశాయి. తాజాగా దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటైన ‘లులు’ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ లో మాల్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
ఇప్పటి వరకు షాపింగ్, రిటైల్, విజిటేబుల్, డ్రెస్సింగ్ లకు ప్రత్యేక షాపింగ్ మాల్స్ ఏర్పడ్డాయి. కానీ ఇవన్నీ ఒకేచోట ఉంచి వినియోగదాదారులను ఆకర్షిస్తోంది ‘లులు’ గ్రూప్ సంస్థలు. ఫుడ్ ఐటమ్స్ నుంచి వినోద కార్యక్రమాల వరకు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో వీటికి బాగా కనెక్ట్ అయ్యారు. ‘లులు’ గ్రూప్ కు సంబంధించిన మొదటి షాపింగ్ మాల్ ను కేరళ లోని కొచ్చిలోని ఏడపల్లిలో ఏర్పాటు చేశారు. 68,000 చదరపు మీట్ల విస్తీర్ణంలో ఉండే ఈ షాపింగ్ మాల్ లో 225 ఔట్ లెట్స్, 2,500 సీట్ల ఫుడ్ కోర్ట్, 6 కేఫ్ లు, 11 ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, అతిపెద్ద హైపర్ మార్కెట్ ఉన్నాయి. వీటితో పాటు 9 స్క్రీన్ గోల్డ్ క్లాస్ మల్టీఫ్లెక్స్, ట్రామ్ఫోలిన్ పార్క్, బౌలింగ్ అల్లే అందుబాటులో ఉంచారు. అలాగే అతిపెద్ద స్కేటింగ్ రింగ్ ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
కేరళకు చెందిన M.A.యూసుఫ్ అలీ ‘లులు’ గ్రూప్ నకు అధినేతగా ఉన్నాడు. చదువు పూర్తి చేసి అబుదాబి వెళ్లిన ఆయన అక్కడ తన మామ ఎం.కె. అబ్దుల్లా నిర్వహిస్తున్న ‘లులు’ గ్రూప్ లో పనిచేశాడు. ఆ తరువాత 1990లో అబుదాబిలో మొదటి హైపర్ మార్కెట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం లులు గ్రూప్ 8 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రాబడిని కలిగి ఉంది. దీంతో యూసఫ్ అలీని మిడిల్ ఈస్ట్ రిటైల్ కింగ్ అని పిలుస్తారు. 22 దేశాల్లో 250కి పైగా హైపర్ మార్కెట్లు 24 షాపింగ్ మాల్స్ ఉన్న లులు అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్ , గ్రేటర్ నోయిడాలో ఫుడ్క ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాడు.
ఇక ‘లులు’ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సోమవారం హైదరాబాద్ లో ప్రకటించారు. గతేడాది దావోస్ లోజరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరిందని, దీంతో తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొచ్చి, బెంగుళూరు, తిరువనంతపురం, లక్నో, కోయంబత్తూర్ లో ఉన్న ఈ మాల్స్ ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే 6వ నగరంగా మారుతుందని అన్నారు.
రూ.300 కోట్ల పెట్టుబడితో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంజీరా మాల్ గా బ్రాండింగ్ చేసేలా మాల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మాల్ లో హైపర్ మార్కెట్, 75 కంటే ఎక్కువగా అంతర్జాతీయ బ్రాండ్ లు, 1,400 మంది సిటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్ సినిమా, మల్టీ-క్యూసిన్ ఫుడ్ కోర్టు, పిల్లలు ఆడుకునేలా వినోద కేంద్రాలు ఉంటాయన్నారు. మొత్తం ఈ మాల్ లో 2000 మంది పనిచేస్తారన్నారు.