BJP Election Plan: అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు.. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అగ్ర నాయకులతో కీలక చర్చలు జరిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ చర్చలు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీనికంటే ముందే ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు అగ్ర నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కర్ణాటక ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దాదాపు ఐదు రోజులపాటు చర్చలు జరిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గడ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మార్పులు చేయాలని, కేంద్ర మంత్రివర్గంలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం ప్రధానమంత్రి మోడీ కోర్టులో ఉంది.
కీలక నిర్ణయాలు తీసుకోకుండా..
ఇక తెలంగాణలో బిజెపి పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ గత ఆరు నెలలుగా అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో పార్టీ బలహీన పడిందని తెలుస్తోంది. దీనివల్ల బిజెపిలో చేరాల్సిన వాళ్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక శనివారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ బండి సంజయ్ వ్యవహార శైలి గురించి హోం మంత్రి అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం కూడా వారు అమిత్ షాను కలుసుకొని పార్టీ తీరు తేనుల గురించి చర్చించారు..”పార్టీని వదలొద్దు. మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పండి.” అంటూ అమిత్ షా వారికి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో కెసిఆర్ అవినీతిపై బలమైన చర్యలు ఉంటాయని, ఎవరినీ ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. అమిత్ షా మాటలతో ప్రస్తుతానికి అయితే బిజెపిలో ఉండి, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలనే నిర్ణయానికి ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే పార్టీ మారే ఆలోచన తమకు లేదని కార్యకర్తలకు చెప్పినట్టు విశ్వసనీయ తల సమాచారం. ఇదే సమయంలో తమకు ఎటువంటి పదవులు అవసరం లేదని వారు చెప్పినట్టు తెలుస్తోంది.
నాయకత్వ మార్పులు
ఇక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు చేపట్టాలని, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. అయితే సంతోష్, అమిత్ షా సూచించిన ప్రతిపాదనలో వేటికి కూడా ప్రధానమంత్రి ఆమోద ముద్ర వేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో అమిత్ షా, సంతోష్ చెప్పిన ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో గెలవలేకపోయామని మోడీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. నాటక ఎన్నికల్లో పూర్తిగా సంతోష్ అంచనాలపైనే ఆధారపడటం వల్ల దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని మోడీ అంతర్గతంగా అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై స్వయంగా పరిశీలించిన తర్వాతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, పర్యటనలో ముగించుకుని ఇండియాకు వచ్చిన మోడీ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కీలక అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నట్టు ఉంది. ఇక ఎన్నికల నేపథ్యంలో తాను తీసుకోబోయే కీలక నిర్ణయాలను వెలువరించే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు ఎన్డీఏను విస్తరించాలని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాట్నాలో జరిగిన విపక్ష భేటీకి 15 పార్టీలు హాజరు కాగా.. అ కాళిదళ్, ఆర్ఎల్డి సహా పలు పార్టీలు హాజరు కాలేదు. వీటిని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే తెరవెంక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆ పార్టీల నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు
ఇక మరోవైపు అమిత్ షా, సంతోష్ ఈటెల రాజేందర్ వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పొత్తులు, పార్టీ నాయకత్వం మార్పులపై పలు సూచనలు కూడా చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.. ఎన్నికల జరిగే రాష్ట్రాల నేతలకు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలని, ఒకటికంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల నుంచి అదనపు శాఖలను వారికి అప్పగించాలని అమిత్ షా, సంతోష్ సూచించినట్టు సమాచారం. పలు పార్టీలను కూడా ఎన్డీఏ లోకి ఆహ్వానించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేస్తేనే కార్యరూపం దాలుస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.