
RCB Vs LSG: బెంగళూరు – లక్నో జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఫలితం ఇరు జట్లతో దోబూచులాడింది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. వీటిలో గంభీర్.. ఆవేశ్ ఖాన్ కు సంబంధించిన సన్నివేశాలు మరింత ఆసక్తిని కలిగించాయి.
బెంగుళూరు వేదికగా సోమవారం రాత్రి జరిగిన లక్నో – బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తిని కలిగించింది. బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేయగా, 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు తొలి నుంచి ధాటిగానే బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఓపెనర్లు మేయర్స్, రాహుల్ ఇద్దరూ ఆశించిన స్థాయిలో స్కోర్లు చేయనప్పటికీ.. ముందు స్టోయినీస్ 30 బంతుల్లో 65 పరుగులు, తరువాత నికోలస్ పూరన్ 19 బంతుల్లో 62 పరుగులు, ఆయుష్ బదోని 24 బంతుల్లో 30 పరుగులు చేయడంతో లక్నో జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్ళింది.
గంభీర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆర్సీబీ అభిమానులు..
సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడంతో బెంగుళూరు జట్టుకు మద్దతుగా భారీగా అభిమానులు వచ్చారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరు జట్టుకు మద్దతుగా భారీ ఎత్తున అభిమానులు సందడి చేస్తూ కనిపించారు. అయితే చివరి బంతికి విజయం లక్నో జట్టుకు దక్కడంతో.. వారి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లతో లక్నో జట్టు మెంటార్/కోచ్ గౌతమ్ గంభీర్ కరచాలనం చేశాడు. అదే సమయంలో స్టేడియంలోని అభిమానుల వైపు చూస్తూ.. నిశ్శబ్దంగా ఉండాలంటూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ హడావిడి అంటూ గంభీర్ పై మండిపడుతున్నారు.

హెల్మెట్ విసిరేసిన ఆవేశ్.. మందలించిన రిఫరీ..
చివర బంతికి అనూహ్యంగా విజయం దక్కడంతో లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్ అతిగా స్పందించాడు. చివరి బంతికి విజయాన్ని జట్టుకు అందించిన ఆనందంలో ఆవేశ్ తన హెల్మెట్, బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఆవేశ్ ప్రవర్తనకు గాను మ్యాచ్ రిఫరీ అతడిని మందలించాడు.
బెంగళూరు సారధికి జరిమానా..
ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా.. బెంగుళూరు జట్టు కెప్టెన్ డూ ప్లెసిస్ కు పెనాల్టీ విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అతనికి రూ.12 లక్షల జరిమానా పడింది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ పూరన్ 19 బంతుల్లోనే నాలుగు ఫోర్లు 7 సిక్సులతో 62 పరుగులతో వీర విహారం చేసి జట్టుకు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి పెట్టాడు.