Keeway RR 300: హంగేరీకి చెందిన మొటో వాల్ట్ అనే సంస్థ ఇండియాలో కీవే ఆర్‌ఆర్300 బైక్‌ను రిలీజ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ మిడిల్‌వెయిట్ స్పోర్ట్స్ బైక్ విభాగంలోకి వస్తుంది. ఫీచర్ల పరంగా ఇది కీవే కే300ఆర్ బైక్‌ను పోలి ఉంటుంది. భారత ప్రీమియం స్మాల్-కెపాసిటీ స్పోర్ట్‌బైక్ సెగ్మెంట్‌లో ఇది టీవీఎస్ అపాచే ఆర్‌ఆర్ 310, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్‌ఆర్, కేటీఎం ఆర్‌సీ 390లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కీవే ఆర్‌ఆర్300 లో 292సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,750 ఆర్‌పీఎం వద్ద 27.5 బీహెచ్‌పీ పవర్, 7,000 ఆర్‌పీఎం వద్ద 25 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. దీని వల్ల గేర్లు తగ్గించేటప్పుడు కలిగే జర్కులు తగ్గుతాయి. ఈ బైక్ టాప్ స్పీడ్ 139 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. దీనిలో బేసినెట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉంది. ముందు వైపు యూఎస్‌డి ఫోర్క్స్, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.
బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యుయల్-ఛానెల్ ఏబీఎస్ లభిస్తుంది. టైర్ సైజులు ముందు 110/70 R17, వెనుక 140/60 R17. డిజైన్ విషయానికి వస్తే.. ఈ బైక్ షార్ప్, అగ్రెసివ్ లుక్‌తో వస్తుంది. బూమరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, లేయర్‌డ్ ఫెయిరింగ్, సన్నని రేక్డ్ టెయిల్ సెక్షన్ దీని స్పెషాలిటీ.
ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, మొత్తం లైట్ సెటప్‌లో ఎల్‌ఈడీ లైట్లు, ట్యాంక్ కింద రైడ్ రెబెల్ డెకాల్ కూడా ఉన్నాయి. కీవే ఆర్‌ఆర్300 తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. దీని బుకింగ్ భారతవ్యాప్తంగా బినెల్లీ, కీవే డీలర్‌షిప్‌లలో ప్రారంభమైంది. జులై చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
టీవీఎస్ అపాచే ఆర్‌ఆర్ 310 భారతదేశంలో రూ.2.77 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. దీని లేటెస్ట్ వెర్షన్ ఇటీవల లాంచ్ అయింది. కొత్త వెర్షన్‌లో అనేక ఫీచర్లు యాడ్ చేశారు. ఇది మూడు స్టాండర్డ్, మూడు బిల్ట్-టు-ఆర్డర్ ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఈ బైక్ 3 వేరియంట్లు, 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 312.2 సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంది, ఇది 37.48 బీహెచ్‌పీ పవర్, 29 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. అపాచే ఆర్‌ఆర్ 310 బైక్ బరువు 174 కేజీలు, దీని ఫ్యూయెల్ ట్యాంక్ 11 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. కీవే ఆర్‌ఆర్300 ధర అపాచే ఆర్‌ఆర్ 310 కంటే రూ.77,000 తక్కువ.