Homeక్రీడలుWest Indies T20 World Cup: -వెస్టిండీస్ ఫ్లాప్ కథ: ఏవీ తండ్రి గతంలో కురిసిన...

West Indies T20 World Cup: -వెస్టిండీస్ ఫ్లాప్ కథ: ఏవీ తండ్రి గతంలో కురిసిన సిక్సర పిడుగులు

West Indies T20 World Cup: హేలి అనే తోకచుక్క ఉంటుంది. ఇది తోకచుక్కల అన్నింటికంటే ప్రకాశవంతమైనది. ఉల్కా పాతం కంటే ఎక్కువ వెలుగులు విరజిమ్ముతుంది. కానీ అది ఎంత గొప్పదో ఒక బలహీనమైన క్షణాన ఏదో ఒక గ్రహాన్ని ఢీ కొట్టి నేల రాలుతుంది. ప్రస్తుతం ఈ పోలిక ఎందుకు చెబుతున్నామంటే.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను వెస్టిండీస్ జట్టు శాసించింది. ఆరడుగులకి మించి ఉండే ఫాస్ట్ బౌలర్లు వేసే బంతులు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్లకి చుక్కలు చూపించేవి. కొందరైతే బ్యాటింగ్ చేసేందుకు కూడా భయపడేవారు. అలాంటి వెస్టిండీస్ జట్టు నేడు ప్రపంచ కప్ లో ఆడకుండానే వెనుతిరగాల్సి రావడం క్రీడా విషాదాంతం.

West Indies T20 World Cup
West Indies T20 World Cup

బాధనిపిస్తోంది

వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది..
నిజానికి ట్వంటి ట్వంటి వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి బంతిని సముద్రంలోకి కొడతారు…అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి అది వెళ్లిన దూరాన్ని కొలుస్తారు…. టీ ట్వంటి కి కావల్సింది అదేకదా. గార్డన్ గ్రీనిడ్జ్ కవర్ డ్రయివ్ వేగానికి బంతి వెళ్లే దారిలో దానికింది పచ్చిగడ్డి భగ్గున కాలిపోయేది. రాయ్ ఫెడ్రిక్స్ ఫైన్లెగ్ మీంచి చేసే హుక్ సౌందర్యానికి బౌలర్ కూడా ముగ్దుడయేవాడు. వివియన్ రిచర్డ్స్ మాన్లీగా కులుకుతూ స్టేడియంలోకి నడుస్తుంటే లెక్కలేనంత మంది నీనాగుప్తాలు మసాబా గుప్తాలను కలకనేవారు. మాల్కం మార్షల్ బంతి ముక్కుముందు నుంచి జోరీగ శబ్దం చేసుకుంటూ మెరుపులా వెళ్లడం మాత్రమే చాలా మంది బ్యాట్స్ మెన్ కు తెలుసు. యాండీరాబర్ట్స్ వేగం బంతికీ తూటాకూ తేడా చెరిపేసేదట.

ఏవి నాటి సిక్సర పిడుగులు

ఈ మధ్య కూడా విండిస్ తక్కువేమీ తినలేదు. గేల్ కొట్టడం రాక్షసత్వానికి నకలే. బ్రావో బ్రేవోనే కదా. హోల్డర్ రికార్డ్ హోల్డరే గా. క్లయివ్ లాయిడ్ చూపులకు శాంతానికి నిలువెత్తురూపంగా ఉంటాడా…
అతనిలోపలి స్పోర్టివ్ క్రూరత్వం ఎనభైమూడు ఫైనల్ లో ఓడిపోయిన తరవాతగానీ భళ్లున బయటపడలేదు.
ఈ క్లయివ్ ఫాదర్ థెరెసా! అప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచేసుకుని ఉన్నాడు కనుక ముచ్చటగా మూడోసారి కూడా ప్రుడెన్షియల్ ను ఎత్తేసి రిటైరైపోదామనుకున్నాడు. ఆ ఓటమి అతనిలోపలి క్రీడా రాక్షసుడిని నిద్రలేపింది. రిటైర్మెంట్ ఆలోచనను అటకెక్కించాడు. భారత్ టూర్ పెట్టుకున్నాడు. ఆరు టెస్టుల్లో మూడింట్లో ఇండియాను చావచితక్కొట్టాడు.
వన్డేల్లో కూడా అదే హింస. వరల్డ్ కప్ హీరో మొహిందర్ ను దాదాపుగా ఎనిమిది సార్లు సున్నా దాటనివ్వలేదు. వాటిలో మూడో నాలుగో పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్.

West Indies T20 World Cup
West Indies T20 World Cup

అవమానం సహించలేక భారత క్రికెట్ మతస్థులు గవాస్కర్ మీద రాళ్ల వర్షం కురిపించినపుడు బహుశా
లాయిడ్ లోలోపల కసిగా నవ్వుకునే ఉంటాడు. ఒక భారత బాట్స్మన్ అత్యధిక స్కోరు 236 ఈసిరిస్ లోనే గవాస్కర్ చేసినా అభిమానులు క్షమించలేదు.
కపిల్ ఒక ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీసిన ఫీట్ కూడా సిరీస్ ఘోర ఓటమి కింద కప్పెట్టుకుపోయింది. ఆ విధంగా ప్రతీకారంలో పరాకాష్ట లాయిడ్.
నిప్పులు చిమ్ముతూ నింగికి నువ్వెగిరిపోతే నిభిడాశ్చర్యంతో వీరు…
నెత్తురు కక్కుతూ నేలకు నువు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే …అనేది నిజమే కావచ్చుగానీ నేనైతే విండీస్ నెత్తురు కక్కుతూ నేలరాలడాన్ని నిర్దాక్షిణ్యంగా మాత్రం చూడలేకపోతున్నామని క్రీడాభిమానులు వాపోతున్నారు. రెండుసార్లు t20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు అనామకంగా టోర్నికి ముందే ఇంటి బాట పట్టాల్సి రావడం దురదృష్టకరం. పైగా వివిధ లీగ్ మ్యాచ్లో ప్రతిభ చాటి చెప్పే వెస్టిండీస్ క్రీడాకారులు జాతీయ జట్టు విషయానికి వచ్చేసరికి అంతగా ఆడటం లేదు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వద్ద కూడా సరైన నిధులు లేకపోవడంతో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. ఇది అంతిమంగా వారి ఆటపై ప్రభావం చూపిస్తుంది. ఇలా ఎన్ని చెప్పుకున్నా ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ జట్టు లేకపోవడం బాధాకరమని క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు వాపోతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular