TCS Mass Resignation 2023: ప్రస్తుతం ఐటి పరిశ్రమ ఎలా ఉంది? అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.. ఆర్థిక మాంద్యం వల్ల ప్రాజెక్టులు లేక నరకం చూస్తోంది. ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి చెల్లింపులు నిలిచిపోవడంతో డబ్బు సర్దుబాటు కావడం లేదు. దీంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెద్ద ఐటి కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు ఇదే దారిని అనుసరిస్తున్నాయి. ఒక సంస్థ అంచనా ప్రకారం గత ఏడాది చివరి నుంచి ఈ ఏడాది మే వరకు వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. భవిష్యత్తులోనూ చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని కొన్ని సంస్థల నివేదికలో తేలింది. ఇదంతా పక్కన పెడితే దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు తమ కొలువులకు టాటా చెబుతున్నారు. అసలే ఆర్థికమాంద్యం నడుస్తున్న ఈ తరుణంలో మహిళలు ఒక్కసారిగా ఉద్యోగాలకు రాజీనామా చేయడం నివ్వెర పరుస్తోంది.
అవసరం లేదు
మన దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ ఏదంటే టక్కున వచ్చే సమాధానం టిసిఎస్. ఇందులో పని చేయడాన్ని చాలామంది తమ స్టేటస్ సింబల్ గా పేర్కొంటారు. అలాంటి టిసిఎస్ కంపెనీ లో పనిచేసేందుకు తమకు ఇష్టం లేదని పేర్కొంటూ ఇటీవల కొంతమంది మహిళా ఉద్యోగినులు తమ కొలువులకు రాజీనామా చేశారు. అంతేకాదు భవిష్యత్తులోనూ టిసిఎస్ కంపెనీలో చేరబోమంటూ స్పష్టం చేసి వచ్చారు. వాస్తవానికి ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రాజీపడదు. పైగా మెరుగైన వేతన శ్రేణి ఇస్తుంది. ఇతరత్రా ప్రయోజనాల విషయంలోనూ ఆ సంస్థ మార్కెట్ లో లభిస్తున్న వాటికంటే ఎక్కువగానే ముట్ట చెబుతుంది. అలాంటి సంస్థలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదని మహిళా ఉద్యోగినులు ముఖం మీద చెప్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ రాజీనామా చేసిన వారు మామూలు ఉద్యోగులు కారు. వారంతా కూడా పెద్దపెద్ద స్థాయిలో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం.
ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే
కోవిడ్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల ఐటీ ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతున్నది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, ఇంట్లో నచ్చిన వాతావరణంలో పని చేయడంతో ఉద్యోగులు హాయిగా తమకు నచ్చిన టార్గెట్ ను పూర్తి చేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దక్కినా ఇంట్లో వాళ్లతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. కోవిడ్ రాకముందు ఐటీ ఉద్యోగులు కంపెనీలకు వెళ్లి పని చేసేవారు. శని, ఆది వారాలు సెలవు ఉన్నప్పటికీ.. ఆ ఐదు రోజులు వారికి ఊపిరి సలపనంత పని ఉండేది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆ తరహా పని ఉన్నప్పటికీ ఇంటి వద్ద నుంచి కార్యకలాపాలు సాగిస్తుండడంతో ఉద్యోగులకు అది ఒత్తిడిగా అనిపించడం లేదు.
కోవిడ్ పరిస్థితులు తగ్గిపోవడంతో..
ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు పూర్తిగా తగ్గిపోవడంతో కంపెనీలు కార్యాలయాలకు వచ్చి పని చేయమని కోరుతున్నాయి. ఈ జాబితాలో టిసిఎస్ కూడా ఉంది. అయితే వర్క్ ఫ్రం హోమ్ కు అలవాటుపడ్డ మహిళా ఉద్యోగినులు ఆఫీసుకు వచ్చి పని చేసేందుకు ఇష్టపడటం లేదు. తాము వర్క్ ఫ్రం హోం చేస్తాం అన్నప్పటికీ సంస్థ ఒప్పుకోకపోవడంతో వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో టిసిఎస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం విషయంలో విధానం మార్చుకోబోమని కంపెనీ స్పష్టం చేసిన నేపథ్యంలో. మహిళా ఉద్యోగినులు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో టిసిఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగినులు రాజీనామా చేస్తుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది