Qualities: ప్రతి ఒక్కరు తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అందమైన జీవితాంతం కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రణాళికలు, లక్ష్యాలు ఏర్పరచుకున్న తర్వాత వాటి గమ్యం చేరే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో పటిష్టం లేకపోవడంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేయలేక పోతారు. అయితే ఇందుకు ఆత్మవిశ్వాసం అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలి? ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి?
లక్ష్యం:
కొంతమంది తమ స్థాయికి మించిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు డిగ్రీ పూర్తి చేసిన వారు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండు అని అనుకుంటారు. అందుకోసం ప్రయత్నాలు చేసే విఫలమవుతారు. అయితే చదువుకు తగిన ఉద్యోగం ఎంచుకొని ఆ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం పూర్తి కావడంతో హాయిగా జీవించగలుగుతారు. అందువల్ల స్థాయికి మించిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఏకాగ్రత:
చాలామంది ఒక పనిని మొదలు పెట్టిన తర్వాత దానిని నిర్లక్ష్యంగా వదిలేస్తారు. ఆ తర్వాత అది పూర్తి కాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉంటారు. అందుకు కారణం ఆ పనిపై ఏకాగ్రత లేకపోవడమే. ఒక పనిని ఎంచుకున్నప్పుడు దానిపైనే దృష్టి ఉంచాలి. అది పూర్తి కావడానికి ఎన్ని ఇబ్బందులు అయినా ముందుకు వెళ్లాలి. అప్పుడే చేపట్టిన పని సక్సెస్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అవసరం.
ఆరోగ్యం:
కంప్యూటర్ యుగంలో చాలామంది కూర్చొని పనిని ఎక్కువగా చేస్తున్నారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం కూడా సహకరించాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో భాగంగా శారీరక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా కాపాడుకోవాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు.
ధైర్యం:
ఏ లక్ష్యం అయినా నిర్ణయించుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు, వడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలి. పరిస్థితులకు భయపడి వెనుకడుగు వేయడం వల్ల జీవితంలో ఏది సాధించలేరు. అంతేకాకుండా సమాజంలో ఉన్న పరిస్థితులకు భయపడి చేసే పనిని మధ్యలోనే ఆపివేయడం వల్ల లక్ష్యం పూర్తి కాకుండానే ఉంటుంది. అందువల్ల ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి.
విమర్శలు:
సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అందరూ మనకు మద్దతు ఇచ్చే వారే అని అనుకుంటే పొరపాటే. మనం చేసే పనుల్లో విమర్శలు చేసే వారు కూడా ఉంటారు. అయితే విమర్శలు చేసినంత మాత్రాన మన స్థాయిని మనమే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. విమర్శలు స్వీకరిస్తూనే లోపాలు ఏంటో తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. కొందరు వ్యక్తుల వల్ల లక్ష్యాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపివేయవద్దు.
వాగ్దానం:
సమాజంలో గుర్తింపు రావాలంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఒకసారి మాట ఇస్తే అది నష్టం జరిగినా దాని గురించే ఆలోచించడం వల్ల విలువ పెరుగుతుంది. దీంతో ఒక లక్ష్యం పూర్తి చేయడానికి ఇది సహకరిస్తుంది. అందువల్ల ఎవరికైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయాలి.