
Maredu Tree : మన సనాతన సంప్రదాయాలలో చెట్లను పూజించడం కూడా ఆనవాయితీ. ఇందులో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడికి ఇష్టమైన చెట్టుగా దీనికి పేరు. అందుకే శివపూజలో మారేడు దళాలు ప్రధానమైనవి. వీటితో పూజిస్తే పరమశివుడు సంతోషించి మనకు సకల సౌభాగ్యాలు ఇస్తాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో మారేడు చెట్టును మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా? లేదా? అనే సందేహాలు అందరికి వస్తున్నాయి.

మారేడు విశిష్టత
రామాయణాన్ని రచించిన వాల్మీకి ఓ దొంగ అనే సంగతి అందరికి తెలుసు. అతడు రోజు వేటకు వెళ్లేవాడు. ఒకరోజు వేటకు వెళ్లి మారేడు చెట్టు ఎక్కి కూర్చుని ఈ రోజు జంతువు దొరుకుతుందా? లేదా? అని ఒక్కో ఆకు తెంపుకుంటూ వేస్తాడు. అప్పుడు ఆ చెట్టు కింద ఓ శివలింగం ఉంటుంది. అతడు వేసే ఆకులన్ని లింగంపై పడతాయి. ఇలా అతడికి పుణ్యం లభించి రుషిగా మారతాడు. మారేడు చెట్టు విశిష్టత అంటే అది. అందుకే దాన్ని మనం పూజలో ఎక్కువగా వినియోగిస్తాం.
దీని ప్రత్యేకత ఏమిటి?
మారేడు చెట్టు ప్రత్యేకత ఏమిటంటే అన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి. కానీ మారేడు మాత్రం నేరుగా కాయలే కాస్తుంది. శివుడికి పూజ చేసేటప్పుడు ఈనెలతోనే పూజ చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని ఆకులను తొడిమ తీసి పూజకు వినియోగిస్తాం. కానీ మారేడును మాత్రం తొడిమతోనే పూజించాలి. ఇలా చేస్తేనే శంకరుడు మనకు వరాలు ఇస్తాడట.

ఆకులను ఎప్పుడు కోసుకోవాలి?
మారేడు ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. బుధ, శనివారాలు మాత్రమే కోయాలి. ఇంకా అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, సంక్రాంతి, శివరాత్రి పండుగ రోజులలో కూడా కోయకూడదు. అంతకంటే ముందు రోజే వాటిని సేకరించుకోవాలి. ఈ రోజు వాడినవి మళ్లీ కడిగి రేపు కూడా వాడుకోవచ్చు. మారేడు చెట్టు ప్రదక్షిణలు చేసి దాన్ని తాకితే సాక్షాత్తు పరమశివుడిని తాకినట్లే. బిల్వ పత్రాలు మనకు ఎన్నో శుభాలు కలిగిస్తాయి. మన ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
బిల్వ పత్రాలతో..
బిల్వ పత్రాలను మెత్తగా నూరి శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. మారేడు వేర్ల రసం తేనెతో కలిపి తాగితే వాంతులు ఆగుతాయి. మారేడు దళాలను దంచి కళ్లపై లేపనంగా పూసుకుంటే కంటి సమస్యలు లేకుండా పోతాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని నిరోధిస్తుంది. మహాలక్ష్మి గుండె నుంచి మారేడు దళం పుట్టిందట. అందుకే శివుడికి ఈ చెట్టంటే ప్రాణం. రోహిణి నక్షత్రం రోజు ఈ చెట్టు చుట్టు ప్రదక్షిణ చేస్తే మంచి పుణ్యం లభిస్తుందని చెబుతారు.