Husband And Wife Relationship: ఖమ్మం నగరానికి చెందిన ప్రేమ ఒక ఇండియన్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త సాగర్ ఒక అమెరికన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:00 దాకా పనిచేయాల్సి ఉంటుంది. సాగర్ పని సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పటికీ మాట్లాడుకునేందుకు కూడా సమయం దొరకడం లేదు. దీనివల్ల వారి వైవాహిక జీవితం సజావుగా సాగడం లేదు.
రూపది కలివిడి మనస్తత్వం. ఎవరితోనైనా త్వరగా కలిసిపోతుంది. మాట మాట్లాడింది అంటే ఇక ఆపదు. ఆమె భర్త ఆనంద్ వ్యక్తిత్వం ఇందుకు పూర్తి విభిన్నం. తన పని, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం..ఇలా గడిపేస్తుంటాడు. రూప 100 మాటలు మాట్లాడితే ఆనంద్ ఒక్క మాటతో సమాధానం చెబుతాడు. తన మాటలు వినడం లేదని రూప… వింటూనే ఉన్నా కదా, ఏం చేయాలి అంటూ ఆనంద్.. ఇద్దరు రోజూ గొడవ పడుతూనే ఉన్నారు.
ధన్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో పనిచేసే అవకాశం రావడంతో అక్కడికి వెళ్లింది. ఇది ఆమె భర్త నరేష్ కు ఇష్టం లేదు. ఇక్కడే పని చేసుకుంటూ ఇద్దరం ఉందామన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనని, తన కెరీర్ కు అడ్డు రావద్దని తేల్చి చెప్పింది. ఈ విషయం పై ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. చినికి చినికి గాలి వాన లాగా మారి విడాకుల వరకు వెళ్ళింది.
ఉద్యోగాలు మారుతున్నాయి
కాలానుగుణంగా ఉద్యోగాలు కూడా మారుతున్నాయి. భిన్నమైన వేళలు, భిన్నమైన వాతావరణం మధ్య పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వారి మానసిక, శారీరక ఆరోగ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. కొన్నిసార్లు అవి విడాకులకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వేరు వేరు టైమింగ్స్ లో పనిచేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది.
పని వేళల్లో తేడాలు
వేరువేరు పని షెడ్యూల్స్ కారణంగా జంటలు ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి కలిసి గడిపేందుకు సరిపడా సమయం లేకపోవడం. దీనివల్ల దంపతుల్లో ఒకరిపై ఒకరికి నిర్లక్ష్య భావం ఏర్పడుతోంది. ఇది ఆ బంధంలో ఒత్తిడిని పెంచుతోంది. విరుద్ధమైన షెడ్యూల్స్ లో పనిచేసే జంటలు తమ ఇద్దరూ మాట్లాడుకునేందుకు ఇద్దరికీ అనుకూలమైన సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం. ఇది సవాల్ గా మారి ఆ దాంపత్యంలో అపార్ధాలు, ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఫలితంగా సంఘర్షణ, మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోంది. ఒక భాగస్వామికి పని భక్తుడు ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ పని ఒత్తిడి ఉన్న భాగస్వామే ఇంటి వ్యవహారాలు చెక్కబెట్టుకోవాల్సి వస్తున్నది. ఇది కోపానికి, వాగ్వాదానికి కారణమవుతోంది. ఒక భాగస్వామికి ఎక్కువ పనిగంటలు.. అంతే ఎక్కువ పనీ ఒత్తిడి ఉన్నప్పుడు ఆ అలసట, బర్న్ అవుట్ భావోద్వేగ సమస్యలకు దారితీస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతోంది.
ఇలా చేయొచ్చు
విభిన్నమైన పని షెడ్యూల్లో విధులు నిర్వహించేవారు మీ భాగస్వామితో నిజాయితీగా మీ ఆందోళనలు, అవసరాలు పంచుకోవాలి. మీ పని షెడ్యూల్ కు సంబంధించి స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ భాగస్వామితో బంధానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇద్దరికీ వీలు కుదిరినప్పుడు సరదాగా మాట్లాడుకోవాలి. భాగస్వామి పని డిమాండ్లు కూడా అర్థం చేసుకోవాలి. వారి అవసరాలకు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవాలి. పరమైతే ఇంట్లో అదనపు బాధ్యతలు కూడా తీసుకోవాలి. పిల్లలు ఉంటే మీ కార్యకలాపాలు వారిని కూడా కలుపుకుపోవాలి. ఇది జ్ఞాపకాలను రీ క్రియేట్ చేయడంలో తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు తగినంత నిద్ర, వ్యాయామం, విశ్రాంతి తదితర కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించాలి. ఇన్ని చేసినప్పటికీ ఒత్తిడి లేకపోతే ఏ మాత్రం మొహమాట పడకుండా సైకాలజిస్ట్ ను కలవాలి. అప్పటికి ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. కానీ తొందరపడి విడాకులు తీసుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. బంధాలకు బీటలు వారతాయి.