
IPL2023 : టీమిండియాకు ఒకప్పటి విజయవంతమైన కెప్టెన్ ధోనీ లో వేడి తగ్గిందా? ఐపీఎల్ లో అతడి కెప్టెన్సీ పేలవంగా సాగుతున్నదా? అంటే .. ఈ ప్రశ్నలకు టీమ్ ఇండియా ఒకప్పటి సీనియర్లు ఔను అనే సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ 16వ ఎడిషన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం చెన్నై అభిమానులను కాదు, మిగతా జట్ల అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీని అంతటికి కారణం ధోని పేలవమైన కెప్టెన్సీ అని టీం ఇండియా మాజీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండేను ధోని ఉపయోగించిన తీరును సీనియర్ ప్లేయర్లు తప్పుపడుతున్నారు. భారీగా పరుగులు ఇచ్చిన తుషార్ తో కాకుండా మొయిన్ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్ వేయించుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్తున్నారు.. కుడి చేతి వాటం బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్ తో బౌలింగ్ చేయిస్తే ఫలితం ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఇంతటి చిన్న లాజిక్ ధోని ఎలా మర్చిపోయాడని వారు ప్రశ్నిస్తున్నారు.. దేశవాళీ క్రికెట్లో పాత బంతితో బౌలింగ్ చేసే తుషార్ తో ఆరంభంలో ఓవర్లు వేయించడం ఎంతవరకు సమంజసం అని వారు ధోనీకి చురకలు అంటిస్తున్నారు.

ఇక బ్యాటింగ్ లో నూ గైక్వాడ్, ధోని మినహా మిగతావారు మొత్తం విఫలం కావడం, బౌలింగ్ లోనూ అదే ఒరవడి కొనసాగించడంతో చెన్నై జట్టు గుజరాత్ ముందు తలవంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ మ్యాచ్లో ఓటమికి బ్యాటింగ్లో చేసిన తప్పిదమే కారణమని అభిప్రాయపడుతున్నారు. మైదానంపై తేమ ఉన్న నేపథ్యంలో అదనంగా పరుగులు చేస్తే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని పేర్కొంటున్నారు. గైక్వాడ్ ఇన్నింగ్స్ ను కొనియాడిన సీనియర్ పేయర్లు.. మరో 15_20 పరుగులు ఎక్కువ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
“యువ ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంది.. ముఖ్యంగా హంగార్కేర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు ఇంకా రాటు దేలాల్సి ఉంది. టోర్నీ జరుగుతున్న కొద్దీ అతడు ఇంకా మెరుగవుతాడు.. బౌలర్లు కొన్ని తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. దీపక్ 19 ఓవర్లో అన్నేసి పరుగులు ఇవ్వటం జట్టు విజయా అవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా బౌలర్లు నోబాల్స్ వేయడం తగ్గించాలి” అని చురకలు అంటిస్తున్నారు.
“ఎందుకంటే నోబాల్స్ వేయడం వల్ల చెన్నై జట్టు విజయవకాశాలు సన్నగిల్లాయి. ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ ఉండడం బెటర్ ఆప్షన్ అని ధోని అనుకుని ఉంటాడు. అందుకే ఇద్దర్నీ తీసుకున్నాడు కావొచ్చు. శివమ్ ధూబే రూపంలో ధోనీకి ఒక అవకాశం ఉంది.. కానీ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు.. కానీ ఆ నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని అతడికి కనక బౌలింగ్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది” అని సీనియర్లు ధోనికి సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సలహాలు మననంలో పెట్టుకొని వచ్చే మ్యాచ్ లో అమలు చేస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.