Formula E Race Hyderabad: అంతర్జాతీయ వేదిలకే పరిమితమైన ఫార్ములా రేసింగ్‌కు ఇప్పుడు తెలంగాణ వేదికైంది. తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. తెలంగాణతోపాటూ.. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఫార్ములా రేస్.. ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం ప్రారంభం కానుంది. రేసింగ్‌లో ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. మొత్తం 12 కార్లతో రేసింగ్ ఉంటుంది. 24 మంది రేసర్లు పాల్గొంటున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా రేస్ కార్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లబోతున్నాయి. ఇండియాలో ఇదే తొలి స్ట్రీట్ సర్క్యూట్. ఇందుకు విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ వేదిక కావడం తెలుగు వారికి ప్రత్యేకం. శని, ఆదివారం జరిగే ఈ రేస్‌లో ఇందులో ఆరు ప్రధాన నగరాల నుంచి ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 12 కార్లు ట్రాక్‌పై రయ్ మని దూసుకెళ్లనున్నాయి. 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్నారు.

తొలిసారిగా దేశంలో..
ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా–ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించనుంది. దేశంలోనే తొలిసారిగా స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ ఇది.
ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో ఒప్పందం..
ఫార్ములా రేస్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్‌ఐఏ ఫార్ములా–ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ పర్యవేక్షణలో..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ఫార్ములా లీగ్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఈ లీగ్ జరపాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే.. అంతర్జాతీయంగా ఇలాంటి లీగ్‌లు ఎలా జరుగుతున్నాయో ప్లాన్ రెడీ చేసుకుని.. ఆ స్థాయిలో ట్రాక్‌ని సిద్ధం చేసింది. ఇప్పటికే హైదరాబాద్ చాలా క్రీడలు, రేసులకు కేరాఫ్ అయ్యింది. ఐపీఎల్ తరహాలోనే.. ఫార్ములా రేస్‌కు కూడా భవిష్యత్తులో మంచి ప్రజా స్పందనను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఈ రెండు రోజుల రేస్ కీలకం కాబోతోంది.
ట్రాక్ సిద్ధం.. ఎన్టీఆర్ మార్గ్ బంద్..
హైదరాబాద్‌కి హార్ట్ సింబల్ అయిన హుసేన్‌సాగర్ చుట్టూ ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఐమాక్స్, మింట్ కాంపౌండ్, కొత్త సెక్రటేరియట్ పక్కనే.. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ను రూపొందించారు. రేస్ నేపథ్యంలో ట్రాఫిక్‌ని మళ్లించారు. ఈ రేస్ ట్రాక్ చిన్నదే అయినప్పటికీ.. 17 మలుపులు ఉన్నాయి. దీంతో ఈ రేస్ కిక్ ఇవ్వడం ఖాయం. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు అత్యంత అందంగా, పచ్చని ప్రకృతితో కళకళలాడుతున్నాయి. అలాంటి చోట ఈ రేస్ జరుగుతుండటం వల్ల చూసేవారికి నయనానందంగా ఉంటుంది. రేస్ చూసేవారి కోసం ప్రత్యేక స్టాండ్‌లు ఉన్నాయి. శనివారం క్వాలిఫయింగ్‌తో పాటు రేస్–1 ఉంటుంది.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
దీని ప్రకారం– ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. అలాగే– బుద్ధ భవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్/ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి వైపు మళ్లించారు.

రేస్‌లో మనోళ్లు…
శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్ రేస్ ప్రారంభం కానుంది. రేసులో పాల్గొనే ఆరు జట్లలో 50 శాతం దేశంలోని రేసర్లు.. మరో 50 శాతం విదేశీ రేసర్లు పాల్గొననున్నారు. రేస్‌లో హైదరాబాద్ రేసర్లు పాల్గొంటున్నారు. మల్కాజిగిరికి చెందిన అభినవ్‌రెడ్డి, కొండా అనిందిత్‌రెడ్డి పోటీపడనున్నారు.
డిసెంబర్‌లో మళ్లీ రేస్..
డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో మరోసారి రెండో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో బెంగళూరు స్పీడ్ స్టర్స్, బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచి బృందాలు పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్ పోటీ పడనున్నారు. లీగ్ ఫార్మాట్ ప్రకారం పోటీలు నాలుగు రౌండ్లుగా జరగనున్నాయి. ఆరంభ, ముగింపు రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా.. 2, 3 రౌండ్లను చెన్నైలో నిర్వహిస్తారు.