Aadi Pinishetti Wife Nikki Galrani: నటుడు ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రాని సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేశారు. తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో నిక్కీ గల్రాని గర్భందాల్చారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆది-నిక్కీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు… తమకే తెలియని ఈ న్యూస్ వైరల్ గా మారడంతో నిక్కీ గల్రాని ఖంగుతిన్నారు. మరింత వదంతులు వ్యాపించకముందే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పష్టత ఇచ్చారు.

నాకు సంబంధించిన ఇంత పెద్ద న్యూస్ నాకు కూడా తెలియదు. గర్భవతిని చేశారు. ఆ డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి… అంటూ ఆమె కామెంట్ పోస్ట్ చేశారు. నిక్కీ గల్రాని సందేశంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన నిక్కీ గల్రాని తెలుగులో సునీల్ కి జంటగా కృష్ణాష్టమి మూవీ చేశారు. అలాగే మలుపు మూవీలో నటించారు.
2022 మే 18న నిక్కీ గల్రాని నటుడు ఆది పినిశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ గల్రాని సిస్టర్ సంజన గల్రాని కూడా హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఆమె డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఆ మధ్య శాండిల్ వుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సంజనా గల్రాని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెపై ఈడీ విచారణ నడిచింది.

ఇక పెళ్లి తర్వాత కూడా నిక్కీ గల్రాని నటన కొనసాగిస్తున్నారు. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు ఆది పినిశెట్టి హీరోగా నటిస్తూనే విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో ఆది పినిశెట్టి విలన్ రోల్స్ చేశారు. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ అన్నయ్యగా ఆది చేసిన సపోర్టింగ్ రోల్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన హీరోగా క్లాప్ టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామా చేశారు. ఇది అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి.