
IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బ్యాట్స్ మెన్ కంటే బౌలర్లుగా రాణిస్తున్న ఆల్ రౌండర్లు ప్రతిభతోనే టీమిండియా పట్టు బిగించింది. తొలుత ఆస్ట్రేలియాను 177 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ లోనూ నిలబడడంతో భారత్ భారీ స్కోరుకు బాటలు వేసింది. మరో బౌలర్ అక్షర్ పటేల్ కూడా తోడుగా నిలవడంతో టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించేసింది..
బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్యన నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. తొలి రోజున ఆస్ట్రేలియాను ఔట్ చేసి నిలబెట్టిన ఆల్ రౌండర్లు రవీంద్రజడేజా, అక్షర్ పటేల్ రెండోరోజుకూడా టీమిండియా తక్కువ స్కోరుకు పరిమితం కాకుండా అడ్డుగోడలా నిలబడ్డారు. భారీ స్కోరు దిశగా ఇద్దరూ అర్థసెంచరీలుచేసి నడిపిస్తున్నారు.
ఆస్ట్రేలియా బెంబేలెత్తిపోయిన ఇదే పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ సహనంతో ఆడి ఫలితం రాబట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతోపాటు రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 అర్థశతకాలు సాధించి టీమిండియాను తొలి టెస్టులో విజయం దిశగా నడిపిస్తున్నారు.బౌలింగ్ లో 5 వికెట్లు తీసిన జడేజా బ్యాటింగ్ లోనూ అదరగొట్టడం విశేషం. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టును ముందుంజలో నిలిపాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే కుప్పకూలగా.. భారత్ ప్రస్తుతం 321 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ముగిసే వరకూ 144 పరుగుల ఆధిక్యంలోకి చేరింది.