Ex Girlfriend : ఆమె ఎవరితో డేటింగ్ చేసింది? పెళ్లి చేసుకుందా? ఇప్పుడు బతికే ఉందా? ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా సమాచార హక్కు చట్టాన్నే అస్త్రంగా మార్చుకున్నాడు. 97 సార్లు దరఖాస్తు చేసి 1,886 అంశాలపై సమాచారం కోరాడు. చివరకు అతడి ప్రశ్నల పరంపరకు తమిళనాడు సమాచార కమిషన్ బ్రేకులు వేసింది.
ప్రేమలో పడటం సహజం.. ప్రేమ విఫలమైతే బాధపడటం కూడా సహజమే. కానీ ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆమె గురించి తెలుసుకోవడానికి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, సమాచార హక్కు చట్టం (RTI) కింద ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది? తమిళనాడులో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళనాడుకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన మాజీ ప్రేయసి వ్యక్తిగత జీవితంపై సమాచారం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు చివరకు సమాచార కమిషన్ దృష్టికి వెళ్లాయి. 2021 నుంచి 2024 మధ్య విల్లుపురంలో ఆమెతో కలిసి చదువుకున్న సంతోష్‌తో ఆ యువతి కొంతకాలం సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె క్రమంగా దూరమైంది.
అక్కడితో ఈ వ్యవహారం ముగిసిపోతే అసలు వార్తే ఉండేది కాదు. కానీ ఆమె దూరమైన తర్వాత కూడా సంతోష్ ఆ విషయాన్ని అంత సులభంగా మర్చిపోలేకపోయాడు. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కాస్తా పట్టుదలగా మారింది. చివరకు ఆ పట్టుదల సమాచార హక్కు చట్టం వరకు వెళ్లింది.
97 దరఖాస్తులు.. 1,886 ప్రశ్నలు!
తన మాజీ ప్రేయసి గురించి సమాచారం ఇవ్వాలంటూ సంతోష్ ఏకంగా 97 సార్లు RTI దరఖాస్తులు సమర్పించాడు. వాటిలో మొత్తం 1,886 అంశాలపై వివరాలు కోరాడు. ఆమె ఇప్పటివరకు ఎంతమందితో డేటింగ్ చేసింది? ఆమెకు వివాహమైందా? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇంకా బతికే ఉందా? ఇలా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలను ప్రభుత్వ అధికారుల ముందు ఉంచాడు.
సాధారణంగా RTI ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, నిర్ణయాలు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన మాజీ ప్రేయసి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అధికారులకు కూడా ఈ దరఖాస్తుల పరంపర తలనొప్పిగా మారింది.
చివరకు కమిషన్ కఠిన నిర్ణయం
ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తమిళనాడు సమాచార కమిషన్ సంతోష్ తీరుపై తీవ్రంగా స్పందించింది. RTI వ్యవస్థను వ్యక్తిగత కక్షలు, అనవసరమైన వేధింపుల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అతడిని ఏడాది పాటు సమాచార హక్కు చట్టం కింద కొత్త దరఖాస్తులు సమర్పించకుండా నిషేధించింది. అంతేకాదు, అతడికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కూడా ఆదేశించింది.
ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు. విడిపోయిన తర్వాత కూడా కొన్ని జ్ఞాపకాలు వెంటాడొచ్చు. కానీ అవతలి వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి పదేపదే చొరబడటానికి అవి అనుమతి ఇవ్వవు. ప్రేమ పేరుతో మొదలైన ఆరాటం, 97 దరఖాస్తులు, 1,886 ప్రశ్నల వరకు వెళ్లడం చూస్తుంటే అసలు సమస్య ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవచ్చు.
మాజీ ప్రేయసి జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని బయలుదేరిన సంతోష్‌కు చివరకు ఆమె వివరాలు కాకుండా.. ఏడాది పాటు RTIకి దూరంగా ఉండాలన్న కమిషన్ ఆదేశాలు మాత్రమే మిగిలాయి. ప్రేమకథలో క్లైమాక్స్ అనుకున్నది కాస్తా RTI కథలో కౌన్సెలింగ్ ఎపిసోడ్‌గా మారిపోయింది!