Electric Vehicles Tips: మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలామంది ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉండడంతో ఈవీల కొనుగోళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, ఈ వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛార్జిం విషయంలో పొరపాట్లు చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే, 100శాతం ఛార్జ్ చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నష్టాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
100% ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గుతుందా?
అంటే అవును అని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను 100శాతం ఛార్జ్ చేయడం వల్ల వాటి బ్యాటరీ లైఫ్ టైం గణనీయంగా తగ్గిపోతుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు అది ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల కాలక్రమేణా బ్యాటరీ తన కెపాసిటీ కోల్పోతుంది. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా, దీర్ఘకాలంలో బ్యాటరీ క్వాలిటీ క్షీణిస్తుంది. అంటే, మీరు మీ ఈవీని కొన్నప్పుడు బ్యాటరీ ఎంత దూరం నడిచిందో, 100శాతం ఛార్జ్ చేయడం వల్ల భవిష్యత్తులో అంత దూరం నడవకపోవచ్చు. ఇది మీ వెహికల్స్ పర్ఫామెన్స్ను ప్రభావితం చేస్తుంది.
Also Read: బైక్ లాంటి మైలేజ్ ఇచ్చే కార్లు.. త్వరలో మార్కెట్లో దుమ్ములేపేందుకు రాబోతున్నాయ్
పేలిపోయే ప్రమాదం
బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ పర్ఫామెన్స్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. ఈ వేడి బ్యాటరీ లోపల కెమికల్ రియాక్షన్లలను వేగవంతం చేస్తుంది. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగినా, సేఫ్టీ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం మంచిది. అధిక వేడి బ్యాటరీ లోపలి భాగాలను దెబ్బతీస్తుంది. ఇది వాహనం మొత్తం పర్ఫామెన్స్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఎంత వరకు ఛార్జ్ చేయాలి?
100శాతం ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం వెళ్లొచ్చని అనిపించినా, బ్యాటరీకి అయ్యే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని 80శాతం వరకు ఛార్జ్ చేయడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది తయారీదారులు కూడా 80శాతం నుండి 90శాతం మధ్య ఛార్జ్ చేయమని సిఫార్సు చేస్తున్నారు. ఈ లిమిట్లో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. దాని జీవితకాలం పెరుగుతుంది. వేడి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది దీర్ఘకాలంలో మీ ఈవీ బ్యాటరీకి మంచిది. అంతేకాదు, తరచుగా చిన్న చిన్న ఛార్జింగ్‌లు చేయడం, పూర్తిగా డిశ్చార్జ్ అవ్వకముందే ఛార్జ్ చేయడం కూడా బ్యాటరీ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.