Up Coming Cars : ఇటీవలి కాలంలో హైబ్రిక్ కార్లను ఇష్టపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే, హైబ్రిడ్ కార్లు పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్ద పెద్ద కార్ల కంపెనీలు రాబోయే సంవత్సరాల్లో చాలా కొత్త హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయి. మీరు కూడా త్వరలో కొత్త హైబ్రిడ్ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే కాస్త ఆగండి. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్లోకి బైక్ ఇచ్చే మైలేజీతో 5 హైబ్రిడ్ కార్లు రాబోతున్నాయి.
1. మారుతి సుజుకి ఎస్కూడో
మారుతి సుజుకి ప్రస్తుతం Y17 అనే కోడ్ నేమ్‌తో ఒక కొత్త 5-సీటర్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీనికి ఎస్కూడో అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది మారుతి బ్రెజా, గ్రాండ్ విటారా మధ్యలో ఉంటుంది. ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా దీన్ని అమ్ముతారు. ఈ కారు గ్రాండ్ విటారా కంటే కొద్దిగా పొడవుగా ఉండొచ్చు. ఇంజిన్ విషయానికొస్తే గ్రాండ్ విటారా లాగానే హైబ్రిడ్ ఆప్షన్లు ఇందులో కూడా ఉంటాయని అంచనా. మారుతి ఈ కారు 2025 చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు.
2. రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్
రెనాల్ట్ కంపెనీ తమ పాపులర్ డస్టర్ పేరును మళ్ళీ భారతీయ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తుంది. ఈ కొత్త మోడల్ CMF-B+ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇతర ప్రపంచ మార్కెట్లలో ఉన్న హైబ్రిడ్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త రెనాల్ట్ డస్టర్‌లో కస్టమర్లకు చాలా అద్భుతమైన ఫీచర్లతో పాటు అడ్వాన్సుడ్ టెక్నాలజీ కూడా లభిస్తుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ భారతీయ మార్కెట్లోకి 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
3. కియా సెల్టోస్ హైబ్రిడ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా 2026 ఫస్ట్ హాఫ్‌లో భారతదేశంలో న్యూ జనరేషన్ సెల్టోస్ కారును రిలీజ్ చేయనుంది. ఇది భారతీయ మార్కెట్‌లో కియా బ్రాండ్ మొదటి హైబ్రిడ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీలో డిజైన్ మార్పులతో పాటు, 1.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా ఉంటుంది. అంటే, కస్టమర్లకు కొత్త ఎస్‌యూవీలో మునుపటి కంటే మెరుగైన మైలేజ్ లభిస్తుంది.
4. హోండా ఎలివేట్ హైబ్రిడ్
హోండా ఎలివేట్ కారును భారతీయ మార్కెట్‌లో సెప్టెంబర్ 2023లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే విడుదల చేశారు. అయితే, ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. కంపెనీ హోండా ఎలివేట్‌ను హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. హోండా ఎలివేట్ హైబ్రిడ్ 2026 సెకండ్ హాఫ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
5. హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్
హ్యుందాయ్ కంపెనీ తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్‌యూవీ క్రెటాను కూడా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రెడీ చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ 2027 నాటికి భారతీయ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది భారతీయ మార్కెట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన మొదటి హ్యుందాయ్ మోడల్ కానుంది. క్రెటా హైబ్రిడ్ విషయానికొస్తే ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటారు, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ జతచేసి ఉంటాయి. దీనివల్ల మైలేజ్ అద్భుతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.