Domestic Violence Haryana Woman: ఆ యువతి పేరు తను. స్వస్థలం హర్యానాలోని శిఖోహాబాద్.. తనుకు తల్లిదండ్రి, ఓ సహోదరి ఉన్నారు. ఆమెకు 24 సంవత్సరాలు ఉంటాయి. 2023లో ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన అరుణ్ తో తను కు వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఫరిదాబాద్ ప్రాంతంలో రోషన్ నగర్ ప్రాంతంలో తన అత్తింటి వారి ఇంటికి వచ్చింది. మొదట్లో భర్త అరుణ్ తను తో బాగానే ఉండేవాడు. వీరిద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతూ ఉండేది.. కాలక్రమంలో అరుణ్ తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. తనును శారీరకంగా హింసించేవాడు. అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడు.
Also Read: Men Domestic Violence: మగాళ్ళూ గృహహింస బాధితులే
దీనికి అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వంత పాడేవారు. తనును కొడుతుంటే రాక్షసానందం పొందేవారు. దీంతో అరుణ్ మరింత రెచ్చిపోయేవాడు. కట్టుకున్న భర్త అలా హింసించడం తట్టుకోలేక తను కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏడాది పాటు తల్లిగారింటి వద్ద ఉన్నది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పంచాయితీ నిర్వహించారు. ఆ తర్వాత పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిరిన తర్వాత తను అత్తింటివారి ఇంటికి వెళ్ళిపోయింది. అత్తింటి వారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పుట్టింటి వాళ్లకు మళ్ళీ ఫోన్ చేయలేదు. తను కోసం వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి స్పందనా లేదు.
అత్తింటి వారి నుంచి ఫోన్ వచ్చింది
ఏప్రిల్ 9న తనుకు ఆమె సోదరి ప్రీతి ఫోన్ చేసింది. అయితే ఆమె ఫోన్ కలవలేదు. సరిగ్గా రెండు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 23న తను అత్తింటి వారు ప్రీతికి ఫోన్ చేశారు. ” మీ అక్క మా ఇంట్లో లేదు. ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మాకు ఏదో భయంగా ఉంది” అంటూ వారు ప్రీతికి చెప్పారు. వారు చెప్పిన మాటలను ప్రీతి అంతగా విశ్వసించలేదు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తను అత్తింటి వారిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను వారే ఏదైనా చేసి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు.. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. కేసు దర్యాప్తు విషయంలో కొద్దిరోజులపాటు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆ తర్వాత కేసు మీద దృష్టి సారించిన తర్వాత వారికి దారుణమైన వాస్తవాలు తెలిసాయి.
Also Read: లైంగిక వేధింపుల కేసులో సింగర్ కి శిక్ష తప్పదా ?
అరుణ్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆ తర్వాత వారి ఇంటి ముందు ఉన్న పెద్ద గొయ్యిని పరిశీలించి.. అది అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని తవ్వి చూశారు. అందులో కుళ్లిపోయిన శవం కనిపించింది. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. ఆ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అయితే ఇటీవల అరుణ్ తండ్రి తన ఇంటి ముందు పెద్ద గొయ్యి తవ్వాడు. చుట్టుపక్కల వాళ్ళు అడిగితే డ్రైనేజీ కోసం తవ్వకాలు చేపడుతున్నామని చెప్పాడు. చివరికి అందులో తన కోడల్ని వేసి పూడ్చిపెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ గొయ్యి గురించి ప్రధానంగా చెప్పడం విశేషం. చివరికి పోలీసులు ఆ గొయ్యి తవ్విన తర్వాతే అసలు విషయాలు వెలుగు చూడడం గమనార్హం.