Asking strangers for address: కాలం మారుతున్న కొద్ది అభివృద్ధి చెందుతుందని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కానీ ఇదే సమయంలో కొత్త కొత్త మోసాలు కూడా జరుగుతున్నట్లు క్రైమ్ రేట్ తెలుపుతుంది. కొందరు నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని చోరీలకు పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా.. వారు కొత్త రకం మోసాలతో ప్రజల నుంచి ధనం, సొమ్ము దోచుకుంటున్నారు. అయితే ఇటీవల కొందరు మహిళల నుంచి బంగారం దోచుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తున్నారు. అమాయకంగా నటించి వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ఆ మోసం ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు బంగారం దోచుకెళ్లాలంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. లేదా ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలో.. దొంగలు వచ్చి ఇంట్లో ఉన్న సొమ్మును పట్టుకెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళలు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడల నుంచి బంగారం లాక్కెళ్ళి పోతున్నారు. అయితే ఇప్పుడు మహిళల పై ఉన్న బంగారం దోచుకునేందుకు కొందరు కొత్త రకం అయిన మోసానికి పాల్పడుతున్నారు.
ఎవరైనా మహిళలు ఒంటరిగా కనిపిస్తే వారి దగ్గరికి వెళ్లి అడ్రస్ అడిగినట్లుగా నటిస్తారు. అప్పటికే ఆ అడ్రస్ పేపర్ పై మత్తుమందును చల్లి ఉంచుతారు. ఈ మత్తు మందు చల్లిన పేపర్ ను ఇచ్చి అడ్రస్ చెప్పమని అడుగుతారు. ఆ పేపర్ దగ్గర పెట్టుకొని అడ్రస్ చూస్తుండగా ఆ మత్తుమందు స్మెల్ చూడడంతో మైకం వస్తుంది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి పడిపోతారు. ఆ తర్వాత బంగారం దోచుకెళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మత్తుమందులు ఎలా ఉంటాయంటే.. మహిళలే ఆ బంగారాన్ని తీసి దొంగలకు ఇచ్చేస్తారు.
ఈ రకంగా మహిళలపై ఉన్న బంగారం దోచుకెళ్లడానికి కొందరు కొత్త పన్నాగం పన్నుతున్నారు. అందువల్ల రోడ్డుపై ఎవరైనా అపరిచిత వ్యక్తి వచ్చి ఏ విషయం గురించి అడిగినా.. లేదా అడ్రస్ చెప్పమని అడిగినా.. తమకు తెలియదని.. లేదా పట్టించుకోకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు జాగ్రత్తలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇటీవల ఇంట్లోకి వెళ్లి మరి మత్తుమందు చల్లి బంగారం దోచుకెళ్లిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఇంట్లో వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయంలో కూడా వారు ఇంట్లోకి చొరబడి బంగారం దోచుకెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటి ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులతో మాట్లాడకుండా ఉండడమే మంచిది. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే వారితో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
ఇదే సమయంలో ఎవరైనా బంగారం మెరుగుపెట్టాలని వచ్చినా.. వారి గురించి పట్టించుకోవద్దని.. బంగారంనకు సంబంధించి ఏ అవసరం ఉన్నా జ్యువెలరీ షాప్ కు వెళ్లాలని సూచిస్తున్నారు.