Instagram: సోషల్ మీడియా.. ఇటీవలి కాలంలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైందిగా, దిన చర్యలో అదీ ఒక భాగంలా మారిపోయింది. ఇక యువత సంగతి అయితే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ.. చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇన్స్టాగ్రామ్ చూడడం వలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి వారికోసం మెటా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
’నైట్టైం నడ్జెస్’
ఈ ఫీచర్‌తో మనం ఎక్కువ సేపు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లు అలర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అదే పనిగా చూసేవారిని నైట్టైం నడ్జెస్ హెచ్చరిస్తుంది. ప్రతీ పది నిమిషాలకు ఒకసారి అలర్ట్ వస్తుంది. లాగౌట్ చేసి హాయిగా నిద్ర పోవాలని రాత్రి 10 గంటల తర్వాత నుంచి హెచ్చరిస్తుంది. ఈమేరకు మెస్సేజ్, నోటిఫికేషన్ ద్వారా సూచిస్తుంది.
స్క్రీన్ టైమ్ తగ్గించుకునేలా..
మరోవైపు ఇంస్టాగ్రామ్ యూజర్స్ తమ స్క్రీన్ టైం తగ్గించుకునేలా మరో ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. అదే క్వైట్ మోడ్. ఏ పనీపాట లేకుండా రీల్స్ చూస్తూ, రీల్స్ చూస్తూ అందులోనే మునిగి తేలుతున్నారా.. ఈ సమస్య నుంచి బయట పడేందుకు మెటా తీసుకువచ్చిన మరో ఫీచర్ క్వైట్ మోడ్. ఇది ‘డునాట్ డిస్టర్బ్’గా పనిచేస్తుంది.
ఏంటి ఈ క్వైట్ మోడ్..?
ఈ క్వైట్ మోడ్ ప్రస్తుతం అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనెడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అందబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. చదువు, ఇతర పనులపై దృష్టి పెట్టకుండా గంటలకు గంటలు ఇన్‌స్టాలో గడిపే వారికి ఇది ఉపయోగపడుతుంది.
నోటిఫికేషన్స్ ఆగిపోతాయి..
ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడితే ఈ ఫీచర్ అలర్ట్ చేయడమే కాకుండా నోటిఫికేషన్స్ ఆగిపోయేలా చేస్తుంది. యూజర్ స్టేటస్ యాక్టివ్ నుంచి క్వైట్ మోడ్‌కు మారిపోతుంది. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే అంతసేపు ఆగిపోయిన అప్డేట్స్ మళ్లీ కనిపిస్తాయి.