QR code boards: మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎన్నో రకాల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కొన్ని బోర్డులపై క్యూఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మనీ చెల్లించేటప్పుడు మాత్రమే క్యూఆర్ కోడ్ ను ఉపయోగిస్తాం. కానీ ఇలా రోడ్డు పక్కన క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డులు పెట్టడానికి కారణం ఏంటి? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. అసలు ఈ బోర్డులను ఎవరు ఏర్పాటు చేశారు? ఆ వివరాల్లోకి వెళితే..
National Highway Authority of India (NHAI) రోడ్డు పక్కన ఈ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసింది. రోడ్డు మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణికులు తమ గమ్య సమాచారం తెలుసుకునేందుకు.. ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సేవలను పొందేందుకు.. వాహనాలు రిపేర్ కు వచ్చినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ బోర్డులు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఏదైనా సేవలు అవసరం ఉన్నప్పుడు మొబైల్ లో స్కానర్ తో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. దీంతో అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా సేవలను పొందవచ్చు. కేవలం ప్రమాదాలు, అత్యవసర సేవలు మాత్రమే కాకుండా రోడ్డుపై గుంతలు ఉన్నా.. విద్యుత్ వ్యవస్థ ధ్వంసం అయినా.. రోడ్డుపై లైట్లు వెలగకపోయినా.. ఇలా ఏ విధంగా సమస్యలు ఉన్నా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ బోర్డుల వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు ఉపయోగపడతాయి. అధికారులు ఏదైనా సమాచారం పొందాలంటే ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా తీసుకుంటారు. ముఖ్యంగా ఫీల్డ్ లెవల్ కు వెళ్లే అధికారులు వీటిని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
రోడ్డుపై క్యూఆర్ కోడ్ బోర్డు పెట్టే పద్ధతి మొదటగా గుజరాత్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడ స్మార్ట్ కోడ్ ప్రాజెక్టు కింద క్యూఆర్ కోడ్ బోర్డులను అమర్చారు. ఇది విజయవంతం కావడంతో ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం జాతీయ రహదారుల వెంట, టోల్ ప్లాజా వద్ద, ప్రధాన బస్టాండ్ ల వద్ద, నగరాల స్మార్ట్ రోడ్లపై ఈ బోర్డులు కనిపిస్తాయి. కొన్ని జిల్లాల్లో గ్రామీణ రహదారుల పైన కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ఇవి ఉండేలా చూస్తున్నారు.
రవాణా శాఖ ఈ క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేయడం వల్ల అటు ప్రయాణికులకు, ఇటు అధికారులకు సమాచారం తీసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ట్రాఫిక్, భద్రత, రహదారుల పరిస్థితి మొత్తం ఒకే ప్లాట్ వారం మీద తెలుసుకోవచ్చు. వీటివల్ల ప్రమాదాలను నివారించడంతోపాటు.. రోడ్డు మార్గంలో ఉండే సమస్యలను పరిష్కరించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అటు ప్రయాణికులు సైతం ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.