Friendship: ఏ స్వార్థానికి లొంగనిది ఎంత త్యాగానికైనా వెనుకాడనిది స్నేహమే. స్నేహానికి కన్న మిన్న లోకాన లేదారా.. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని సినీ కవులు ఎందరో స్నేహం గురించి వర్ణించారు. మనకంటూ స్నేహితులు లేకపోతే మన జీవితమే వ్యర్థం. అందుకే మన హితం కోరే నలుగురు స్నేహితులు కచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ నిర్వహణతో సతమతమవుతున్నారు. దీంతో స్నేహితులను కలుసుకునే సమయమే ఉండటం లేదు. ఫోన్లలో మాట్లాడుకుంటున్నా మనసు కుదుట పడటం లేదు. ఇంకా ఏదో కావాలనే ఉత్సుకత పెరిగిపోతోంది. స్నేహాన్ని అలాగే ఉంచుకోవాలంటే కొన్ని పనులు కచ్చితంగా చేయాల్సిందే. అవేంటో తెలుసా.

కాలేజీ రోజులు దాటి ఉద్యోగాల్లో చేరడంతో విధి నిర్వహణ ఓ సవాలుగా మారుతోంది. యాంత్రిక జీవితంలో అన్ని యంత్రంలా మారిపోయాయి. పనులు, బాధ్యతలు, కుటుంబం ఇలా అన్నింట్లో ఏదో భారం పడిన చందంగా వ్యవహరిస్తున్నారు. కానీ కాస్త మనసు పెడితే ఇవన్నీ తేలికే. స్నేహితుల మధ్య దూరం పెరగడంతో వారి కష్టాలు పంచుకునే సమయం కూడా ఉండటం లేదు. ఏదైనా శుభకార్యం, అశుభకార్యానికి వెళ్లినా గంటల్లోనే తిరిగొస్తున్నారు. దీంతో స్నేహితుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
స్నేహితుల మధ్య దూరం పెరగకుండా చేయడం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్లలోనే కనిపిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటే హాయిగా ఉంటుంది. ప్రత్యేక దినాల్లో శుభాకాంక్షలు తెలిపినా స్నేహితుడు సంతోషిస్తాడు. ఉద్యోగం, కుటుంబం అంటూ సమయం లేదని చెప్పొద్దు. కనీనం మూడు నెలలకోసారైనా కలుసుకుని చిన్న పార్టీ చేసుకుంటే మనసులు దగ్గరవుతాయి. అందరిలో పరస్పరం ప్రేమ పుడుతుంది. అది అలాగే కొనసాగించేందుకు ఇష్టపడాలి.

ఇంకా వీలైతే ప్రణాళిక వేసుకుని మరీ సందర్శక ప్రాంతాలకు వెళ్లితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందరి మధ్య స్నేహభావం పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడిని కూడా తేలిగ్గా మరిచిపోతారు. స్నేహంలో అంతటి మహత్తు ఉంటుంది. స్నేహితుల మధ్య ఎలాంటి అపార్థాలు ఉండకూడదు. విశ్వాసానికి మారుపేరు స్నేహమే. అలాంటి స్నేహంలో వ్యక్తిగత విషయాలు, రహస్యాలు పొరపాటున కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండు ఉంటాయి. మనం మంచినే తీసుకోవాలి. చెడుతో మనకు పని ఉండదు. మెరుగైన సంబంధాలు ఉండాలంటే అలాంటి వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. స్నేహితుడు కష్టాల్లో ఉంటే పంచుకోవాలి. ఆపదలో ఉంటే రక్షించాలి. తోచినంత సాయం చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి.
ఆర్థిక కష్టాలు అందరికి ఉంటాయి. మనకు ఇబ్బంది ఉందని ప్రతిసారి ఫ్రెండ్ తో ఖర్చు పెట్టించకూడదు. మనం కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత ఖర్చు చేస్తేనే మంచిది. మన మధ్య ఎంత స్నేహమున్నా ఒక్కోసారి దాని పరిధి దాటితే ఇబ్బందులొస్తాయి. అందుకే మన కంట్రోల్ లో ఉండటమే శ్రేయస్కరం. మన ఇంట్లో జరిగే కార్యాలకు స్నేహితుడిని ఆహ్వానించాలి. వారి ఇంట్లో జరిగే వాటికి కూడా మనం వెళ్లాలి. అప్పుడే బంధం గట్టిపడుతుంది.