BRS In AP: స్మశానం ముందు ముగ్గు… రాజకీయ నాయకులకు సిగ్గు ఉండవని అప్పుడెప్పుడో మోహన్ బాబు తీసిన కలెక్టర్ గారు సినిమాలో వినిపించిన డైలాగ్ అది.. ఈ సు విశాల భారత దేశ రాజకీయాల్లో పలు సందర్భాల్లో ఆ డైలాగ్ ను నాయకులు నిజం చేశారు. చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులు ఇప్పుడు సోదర భావం ప్రదర్శిస్తున్నారు.. ముఖ్యంగా కొంతమంది నాయకులు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తున్నారు.. అంతేకాదు ఆంధ్ర ప్రాంతం కెసిఆర్ ప్రధాని అయితే అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.. చాలామందికి ఈ పరిణామం కొత్తగా అనిపించవచ్చు.. కానీ దీన్ని తవ్వి చూస్తే అసలు విషయం బోధపడుతుంది.

ఆస్తులు కాపాడుకునేందుకు
పేరుకు ఆంధ్ర రాష్ట్రమైనప్పటికీ చాలామంది నేతలకు తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి. ఆ మధ్య భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఆస్తి తగాదా ఎంత రచ్చకు దారితీసిందో చూసాం కదా.. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక నాయకుడు సెటిల్ చేశాడు.. ఇది కేవలం వెలుగులోకి వచ్చింది మాత్రమే.. రానివి బొచ్చెడు. ఇప్పుడు ఆంధ్ర లోనే నాయకులు మొత్తం భారత రాష్ట్ర సమితి పాట ఎందుకు పాడుతున్నారు అంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకునేందుకు. ఇందుకు కేసీఆర్ నుంచి కూడా బలమైన హామీ రావడంతో వారు ఆంధ్రాలో భారత రాష్ట్ర సమితికి గ్రీన్ కార్పెట్ పరుస్తున్నారు.
నేడు చేరికలు
కెసిఆర్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు నేరుగా వెళ్లి ఆయన కలిశారు.. ఆంధ్రాలోనూ పోటీ చేయాలని అభ్యర్థించారు.. దీనిని ఎల్లో మీడియా లైట్ తీసుకుంది.. కానీ పింక్ మీడియా హైలెట్ చేసింది. పైగా కేసీఆర్ ను కలిసిన ఆంధ్ర నాయకులకు మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా భూములు, ఆస్తులు ఉన్నాయి.. వీటిని కాపాడుకోవాలంటే గతి లేని పరిస్థితిలో వారు కేసీఆర్ కు జై కొడుతున్నారు.. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగినప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆంధ్ర నాయకులను అప్పటి టిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేశారు. దీంతో వారు గులాబీ కండువా కప్పుకోక తప్పలేదు.. ఇప్పుడు కూడా అటువంటి ఒత్తిడి తీసుకురావడంతోనే వారు భారత రాష్ట్ర సమితికి జై కొడుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఇక సోమవారం పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది.. ఈ కార్యక్రమం మొత్తం హైదరాబాద్ బిఆర్ఎస్ భవన్ లో జరుగుతుంది.. దీనికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యే సూచనలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఆంధ్ర అంటే ఒక శత్రు ప్రాంతంగా చూపించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు అదే ప్రాంతంలో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉంది. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు.
ఎవరెవరు చేరుతున్నారంటే
భారత రాష్ట్ర సమితిలో సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగే సమావేశంలో కేసీఆర్ సమక్షంలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి పార్టీలో చేరుతున్నారు. ఇదే సమయంలో తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేలా తగిన ఏర్పాటు చేశారు.. చంద్రశేఖర్ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేసేలా కేసీఆర్ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయితే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతారని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

వీరి గత నేపథ్యం ఇది
తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీ తరఫునుంచి 2009లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో ఏలూరు వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. తోట చంద్రశేఖర్ తో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు నాయకులు తెలంగాణ భవన్ కు రానున్నారు.. జిల్లాలోని ముమ్మిడి వరానికి చెందిన రాధాకృష్ణ, పి. గన్నవరానికి చెందిన బంగార్రాజు, రాజేష్ కుమార్, కొత్తపేటకు చెందిన శ్రీనివాస రావు, రమేష్, రామచంద్ర పురానికి చెందిన జే.వీ రావు, అవిడికి చెందిన శ్రీనివాస్, పప్పుల వారి పాలేనికి చెందిన మురళీకృష్ణ తదితరులు టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ ఏపీలో విస్తరించేందుకు గాను కేసీఆర్ ఆంధ్రాలో కార్యాలయం తప్పనిసరి అని భావిస్తున్నారు. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు వేగిరం చేసేందుకు విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు స్థలం, ఆఫీసును ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే నిన్నా మొన్నటి దాకా ఆంధ్రా పై విద్వేషాన్ని రగిల్చిన కేసీఆర్…ఇప్పుడు అదే ప్రాంతంలో పార్టీ ప్రారంభించడం అంటే మామూలు విషయం కాదు.