
Grow in Life : జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. జీవన గమనంలో అన్నింటిని ఎదుర్కొని నిలవాలి. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. అలాగే ఎంత పెద్ద పనినైనా మొదట సులభంగానే మొదలుపెడతాం. తరువాత ఎదురయ్యే కష్టాల నుంచి తప్పుకోవద్దు. ఎదురు నిలిచి పోరాడాలి. ధైర్యమే పెట్టుబడిగా శ్రమనే ఆయుధంగా చేసుకోవాలి. ఎవరేం చెప్పినా వినొద్దు. బరిలో దిగాక మన మనసు మాట తప్ప ఇతరులు చెప్పే వాటిని విశ్వసించొద్దు. గమ్యం చేరేవరకు అలుపు లేకుండా కృషి చేయాలి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. అందుకే లక్ష్యం చేరే వరకు విరామం ఉండకూడదు.
తాపత్రయం
మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించే వరకు మనలో తాపత్రయం ఉండాలి. మనలో ఉన్న తపనే మనల్ని గమ్యం వైపు నడిపిస్తుంది. తమ కెరీర్ లో అందరు విజయాలు సాధించాలని కోరుకుంటారు. ఎందుకంటే మనిషి ఆశా జీవి. అలా కోరుకోవడంలో తప్పులేదు. కానీ ప్రయత్నాలు చేయకపోవడమే తప్పు. మన కెరీర్ ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎదగాలనే కృతనిశ్చయం ఉంటే ఏదైనా సాధ్యమే. మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందని అంటారు.
ఒంటరితనం
శ్రమ ఎప్పుడు ఒంటరే. విజయం కలిగాక నీ చుట్టు నలుగురు చేరతారు. నువ్వు చేసే పనిని దైవంగా భావిస్తే నీకు విజయాలు దానంతట అవే వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా ఉండాల్సి రావొచ్చు. అప్పుడు మనం భయపడాల్సిన పనిలేదు. ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకోవాలి. మనం చేరాల్సిన గమ్యం మన కంటికి కనబడాలి. ఇంకేం కనబడకూడదు. మహాభారతంలో ద్రోణుడు అర్జునుడిని అడినప్పుడు ఏం కనబడుతుంది నీకు అర్జునా అంటే పక్షి కన్ను కనబడుతుంది గురువా అన్నట్లు మన కంటిచూపు ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి.
గతం గురించి బెంగ
మనం ఓటమి పాలైనప్పుడు బెంగ పడాల్సిన పనిలేదు. ఎక్కడ పొరపాటు చేశామో గుర్తించుకోవాలి. అంతేకాని గతాన్ని తలుచుకుని కుమిలిపోతే మనకే నష్టం. రేపటి గురించి ఆలోచిస్తేనే మనం ముందుకు వెళ్లగలుగుతాం. ఓటమిని తలుచుకుంటూ కూర్చుంటే విజయం సాధించలేం. ఈ విషయాన్ని గమనించుకుని మన లక్ష్యం గురించి ప్రణాళికలు వేసుకోవాలి. ఎలాగైతే గమ్యం చేరుకుంటామనే దాని మీద స్పష్టమైన అవగాహనతో వెళితే విజయం మన వశం కాక తప్పదు.
సహనం
ఇది చాలా అవసరం. ప్రతి మనిషికి సహనం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఓపికతో ఓరుగల్లు పట్నం సాధించాడట. ఏ పని కూడా అలా మొదలు పెట్టగానే ఇలా అయిపోదు. దానికి సమయం కావాలి. అందుకు మనకు సహనం ఉండాలి. అప్పుడే మనలో సత్తువ పెరుగుతుంది. శక్తి ఉంటేనే ఏదైనా సాధిస్తాం. ఫలితం కోసం కాస్త సమయం పడుతుంది. దానికి మనం ఎంతో ఓపికతో ఎదురు చూడాలి. విజయం సాధిస్తే అన్ని మన దగ్గరకు రావడం జరుగుతుంది.

ప్రయత్నం
ఏదైనా సాధించేందుకు ప్రయత్నించాలి. తప్పులేదు. ప్రయత్నం చేయకపోతేనే తప్పు. అల్పుడు ఏ పని ఆరంభించడు. మధ్యముడు ఆరంభించి వదిలేస్తాడు. ఉత్తముడు మాత్రం దాన్ని పూర్తి చేస్తాడు. మనలో కూడా ఓ ఉత్తముడు ఉన్నాడని గుర్తించాలి. చేసే పని పలు మార్లు చేసినా కరెక్టు చేయలేదనే భావనతో చివరికి విజయం సాధించాలి. అప్పుడే మనకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. దేనికి భయపడకూడదు. ముందుకు వెళ్లడమే కావాలి.
ఈర్ష్యాద్వేషాలు
మరొకరిపై ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకోకూడదు. వారు విజయాలు సాధిస్తున్నారంటే వారి పనికి తగిన ఫలితం వస్తుందనుకోవాలి. మనం కూడా అదే కోవలో ప్రయత్నాలు చేసి విజయాలు అందుకోవాలని భావించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. చేరుకోవాల్సిన గమ్యం గురించి కలలు కనాలి. అంతేకాని ఇతరులపై అసూయ పడితే మనకే మంచిది కాదు. వాటిని పక్కన పెట్టి మన లక్ష్యం చేరే వరకు విశ్రమించకూడదు. విజయానికి కావాల్సిన అన్ని దారులను ఉపయోగించుకుని చివరకు మన కల నెరవేర్చుకోవాలి.