Money: ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు అని కొందరి భావన. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరికలేకుండా డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. కొందరు ఎంత డబ్బు వచ్చినా కసి తీరదు. కోటి రూపాయలు వచ్చినా కూడా 10 కోట్లు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. కానీ ఎంత డబ్బు సంపాదించినా వారిలో సంతోషం మాత్రం కనిపించదు. అయితే కొందరు డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుందని అంటారు. కానీ డబ్బు లేకుండా కూడా సంతోషంగా ఉండే మార్గాలు ఉన్నాయి. డబ్బు లేకున్నా కూడా ఇలా చేస్తే సంతోషంగా ఉండగలుగుతారు. మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబ సభ్యులతో గడపడం:
ఎంత బిజీ ఉన్నా.. ఎన్ని పనులు చేస్తున్న.. ఎంత దూరంలో ఉన్నా . వారానికి ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు లేదా పిల్లలతో ఒకరోజు కేటాయించడం వల్ల వారి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇలా ప్రశాంతంగా ఉండడంతో అందరి మనసులు సంతోషంగా ఉంటాయి. దీంతో వారి మధ్య బంధం బలపడుతుంది. అప్పుడు అదనపు శక్తి చేకూరి ఎక్కువగా పని చేయగలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రకృతిలో విహారం:
ప్రస్తుత కాలంలో చాలామంది బిజీ వాతావరంలో గడుపుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం అంటూ తీరిక లేకుండా ఉంటున్నారు. ఇలా ఎప్పటికీ ఉండడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని.. ఆ తర్వాత గుండె సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివారు నెలకు ఒకసారి ప్రకృతిలో విహరించే ప్రయత్నం చేయాలి. నెలకు ఒకసారి సొంత ఇంటికి వెళ్లడం.. లేదా మనసుకు హాయిగా ఉండే ప్రదేశాన్ని సందర్శించడం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రకృతిలోకి వెళ్లడం వల్ల సూర్యోదయం, స్వచ్ఛమైన గాలి ఎలాంటి డబ్బు వెచ్చించకుండా దొరుకుతాయి.
ప్రస్తుత జీవితం:
కొంతమంది జరిగిన విషయాన్ని తెలుసుకోవడం.. మరి కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆందోళన ఎక్కువగా అయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతం మరిచిపోయి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ప్రస్తుతం ఏం చేయాలో.. ఏం చేయకూడదు అనే విషయాలు మాత్రమే ఆలోచించుకోవాలి. అప్పుడే మన శక్తి ఏంటో తెలుస్తుంది.
చిరునవ్వు:
ఎవరైనా తెలిసిన వారు కనిపిస్తే వారిని పట్టించుకోరు కొందరు. కానీ వారికి ఒక చిరునవ్వు చూపి వారితో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొత్త వారితో మాట్లాడటం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. ఇలాంటి ఉల్లాసం కోసం కొందరు ఎక్కడికి ఎక్కడికో వెళ్తుంటారు. కానీ ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ ఉల్లాసం దొరుకుతుంది.