Nara Lokesh : ఒక్కోసారి మన పని మనకు అందలం ఎక్కిస్తుంది. మన పనితీరు గుర్తింపు దక్కేలా చేస్తుంది. మన నడవడిక, నైపుణ్యం మెరుగుపడితే సమాజం ఇట్టే గుర్తిస్తుంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) విషయంలో అదే జరుగుతోంది. జాతీయస్థాయిలో నారా లోకేష్ పై విస్తృతమైన చర్చ జరుగుతోంది. జాతీయస్థాయిలో చంద్రబాబుకు మంచి ఇమేజ్ ఉంది. కానీ లోకేష్ విషయానికి వచ్చేసరికి ఆయన సామర్థ్యం పై నీలి నీడలు కమ్మేలా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని అధిగమించి.. తనను తాను ప్రూవ్ చేసుకొని.. తన స్టామినాను బయట పెట్టారు నారా లోకేష్. ప్రస్తుతం దేశ పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో ఒక బలమైన హార్ట్ టాపిక్ లోకేష్.
* అడ్డంకులు దాటుకొని..
ప్రతి ఒక్కరికి తమను తాము ప్రూవ్ చేసుకునే సమయం వస్తుంది. అప్పటివరకు అనేక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ సంయమనంతో ఎదురు చూడాలే కానీ.. సమయానికి ఎదురు వెళ్ళకూడదు. నారా లోకేష్ చేసింది అదే. ఆయనపై చేయని దుష్ప్రచారం లేదు. ఆయన సామర్థ్యాన్ని ఎగతాళి చేయని నాడు లేదు. చివరకు పాదయాత్ర చేస్తుంటే ఎదురొడ్డి నిలబడిన వారు ఉన్నారు. ఎగతాళి చేసిన వారు ఉన్నారు. అసలు నువ్వు ఒక్క నాయకుడివేనా అన్న ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ లోకేష్ వాటన్నింటినీ భరించారు. సంయమనంతో ముందుకు వెళ్లారు. పార్టీని అధికారంలోకి తీసుకెళ్లగలిగారు. అయితే ఇప్పుడు పాలనలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. పార్టీలోనూ పట్టు సాధించారు. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నారు. కేంద్ర పాలకుల మనసును దోచుకుంటున్నారు. ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారు. పెద్ద రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్న ఘనత నారా లోకేష్ ది. అయితే దానిని అభినందించకపోగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపంలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
* వారిలో అదే బాధ..
అయితే రాష్ట్రం దాటితే ఇప్పుడు లోకేష్ పేరు మార్మోగిపోతుంది. తమకు వచ్చిన అవకాశాలను ఏపీకి తన్నుకు పోయారన్న ఆవేదన ఉన్నవారు ఉన్నారు. ఆపై లోకేష్ సామర్థ్యాన్ని చూసి అభినందిస్తున్న వారు ఉన్నారు. అయితే 99% నారా లోకేష్ పనితీరును అభినందిస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజాలు, అనలిస్టులు, రాజకీయ, వాణిజ్య విశ్లేషకులు సైతం లోకేష్ ప్రయత్నాలను అభినందిస్తున్నారు. యువ నేతల్లో ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న నేతగా లోకేష్ కు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు లోకేష్ కు అభినందనలు వస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రగిలిపోతోంది.
* తమిళనాడులో రచ్చ..
తమిళనాడులో మంత్రి లోకేష్ కు మద్దతు పెరుగుతోంది. లోకేష్ పని తీరుతో తమ రాష్ట్రాల మంత్రుల పనితీరు పోల్చుకుని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు ప్రజలు. ప్రముఖులు సైతం ఆ జాబితాలో ఉన్నారు. రాష్ట్రం కోసం నిబద్ధతతో పని చేస్తున్న ఆయన శైలిని ప్రశంసిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను పక్కాగా నిర్వహిస్తున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది.
సహజంగానే పొరుగు రాష్ట్రాల నేతలకు ఇది మింగుడు పడదు. ముఖ్యంగా కర్ణాటకలో లోకేష్ పనితీరుపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వంటి నేతలు అసహనానికి గురవుతున్నారు. ఏపీ పై వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అలాంటి నేతలు స్పందిస్తుండడంతో లోకేష్ కు మరింత ప్రచారం లభిస్తోంది. తమిళనాడుకు రావాల్సిన గూగుల్ డేటా సెంటర్.. విశాఖకు తీసుకెళ్లడం వెనుక నారా లోకేష్ పనితీరు ఉందని.. ఈ విషయంలో అధికార డిఎంకె ఎందుకు విఫలమైందని ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నారా లోకేష్ సమర్థ నాయకత్వం, పాలన నైపుణ్యం బయటపడుతున్న సమయం ఇది. ఒక తండ్రిగా చంద్రబాబుకు ఇంకేం కావాలి. కచ్చితంగా భావితరాల నాయకుడిగా లోకేష్ ప్రమోట్ అవుతున్న తీరు మాత్రం అభినందనీయమే.