Criticism: ఏదైనా పని చేస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ గా వస్తుంటాయి. కొందరు కొనియాడితే మరికొందరు వేలు చూపిస్తుంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే నీతో కాదు అనే వారు కొందరు. నష్టం జరుగుతుంది అని భయపెట్టే వారు కొందరు. నువ్వు చెయ్యగలవు అని వెన్ను తట్టే వారు కొందరు. గెలిచిన తర్వాత వావ్ సూపర్ అని పొగిడేవారు కొందరు. వద్దన్న వారే ప్రశంసిస్తుంటారు. ఇక ఇలా అందరినీ పట్టించుకుంటే మీ జీవితంలో మీరు కాకుండా ఇతరులు ఉంటారు. అందుకే కొన్ని పట్టించుకోవద్దు.
విమర్శలను పట్టించుకొని కుంగిపోయే వారు ఎక్కువగా ఉంటారు. ఏదైనా చిన్న మాట తిట్టినా వాటికి తట్టుకోలేరు. కానీ విజయం సాధించాలంటే ప్రతి దానిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడే గెలుపు సొంతం అవుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు పెద్దలు. అందుకే ఎలాంటి మాటలను దరిచేరనీయకుండా, కుంగిపోకుండా నిరంతరం విజయ సాధనకై పోరాడాలి. అప్పుడే మీ గెలుపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
ఎవరైనా ఏదైనా అన్నారంటే కుంగిపోవడం, ఆలోచించడం మానేసి వారికి సమాధానం ఇవ్వడమే మానేయండి. ఊరుకున్నంత ఉత్తమం, బోడి గుండంత సుఖం లేదంటారు పెద్దలు. అందుకే ఎలాంటి విమర్శలను అయిన వదిలేయడం వల్లనే మీరు సంతోషంగా ఉండగలరు. విమర్శలకు మీరు స్పందిస్తే ఎదుటి వారి నుంచి స్పందన మరింత ఎక్కువగా వస్తుంటుంది కానీ తగ్గదు అని గుర్తు పెట్టుకోండి. అందుకే ఎన్ని సార్లు వారు మిమ్మల్ని విమర్శించినా మీరు స్పందించకపోవడమే వారికి సరైన సమాధానం.
విమర్శలో మన తప్పు కనిపిస్తే సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి. కృతజ్ఞతలు కూడా చూపించవద్దు అంటారు పెద్దలు. విమర్శలో కృతజ్ఞత చూపిస్తే చులకన అవుతారట. అందుకే విమర్శలకు, ప్రశంసలకు స్పందించడమే మానివేస్తే మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారు.