Jaggery Benefits: మన జీవన విధానంలో వచ్చే వ్యాధులకు ఎన్నో మందులు వాడుతుంటాం. అందులో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు వంటి వాటికి కూడా మాత్రలు వేసుకుంటుంటాం. ఇలా చిన్న వాటికి కూడా మాత్రలు వేసుకోవడం అంత మంచిది కాదని తెలిసినా ఎవరు పట్టించుకోరు. ఇలాంటి వాటికి వేసుకునే మెడిసిన్స్ కాకుండా ఇంకా మధుమేహం, రక్తపోటు వంటి వాటికి కూడా మందులు వాడుతుంటాం. ఇలా మన శరీరం మొత్తం మందులమయంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో మందుల ప్రభావంతో ఒళ్లు గుల్లబారుతోంది. నిత్యం మందులు వాడుతూ మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసుకుంటున్నాం.

ఆయుర్వేదంలో మనకు ఎన్నో రకాల జబ్బులను నయం చేసే గుణం బెల్లానికి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. బెల్లంతో చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంటి చిట్కాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పెరుగు, బెల్లం కలుపుకుని రోజు రెండు పూటలు తింటే జలుబు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. నెయ్యితో బెల్లం వేడి చేసి మన శరీరంలో ఎక్కడైనా ఏ భాగంలోనైనా నొప్పిగా ఉంటే అక్కడ పెడితే నొప్పి తగ్గిపోతుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారికి కూడా బెల్లం, నెయ్యి సమపాళ్లలో కలిపి తింటే ఐదారు రోజుల్లో తగ్గిపోతుంది.
బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉండటంతో ఇది కణాల్లో ఆమ్లాలు, ఆసిటోన్ లపై దాడి చేసే ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. బెల్లం ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. భోజనం చేసిన ప్రతిసారి బెల్లం కాస్త తింటే ఎసిడిటీ తగ్గించి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయంలో ఉండే హానికర పదార్థాలు, విషపదార్థాలు బయటకు పంపిస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఒంట్లో ఉండే నీటిని బయటకు పంపిస్తుంది.

నీళ్లలో బెల్లం వేసుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. అధిక బరువును తగ్గించడానికి సాయపడుతుంది. గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తుంది. బెల్లంలో ఉండే తీపి శక్తిని పెంచుతుంది. బెల్లంతో మన శరీరాన్ని ఇబ్బంది పెట్టే అనేక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా బెల్లంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతాం. బెల్లంతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున దాన్ని ఉపయోగించుకుని వ్యాధుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.