Pawan Kalyan- KCR: అవి తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు… తెలంగాణ ఏర్పాటు పక్కా అని సమాచారం ఉన్న రోజులు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకల నెరవేరింది. తెలంగాణ ఏర్పాటయింది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కేసిఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్ళింది.. ఒక ఫోటో కూడా దిగింది.. అంతకుముందే తెలంగాణ ఇస్తే భారత రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కెసిఆర్ ఆఫర్ ఇచ్చారు.. ఇది నిజమేనని నమ్మిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేశారు.. అప్పటికే కేసీఆర్ తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఢిల్లీ నుంచి రాగానే కార్యకర్తలతో భారీగా స్వాగతం పలికించుకున్నారు. ప్రజల్లో చర్చకు తెర దేశారు. కానీ మాట ఇచ్చిన కేసీఆర్ మడమతిప్పారు. అంతేకాదు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పార్టీ కాంగ్రెస్ ను మరింత బలహీనం చేశారు. తాను మాత్రం రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారు. దీనిని రాజనీతి అంటే రాజనీతి అని… కపటత్వానికి నిదర్శనం అంటే కపటత్వమని అనుకోవచ్చు. ఇప్పుడు తాజాగా తన భారత రాష్ట్ర సమితిని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ద్వారా కేసిఆర్ సరికొత్త సమీకరణాలకు దారి తీశారు. కానీ దీని ప్రభావం జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

పలు సందర్భాల్లో..
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒకటి రెండు చోట్ల మినహా కేసీఆర్ పై విమర్శలు చేయలేదు.. ఒక వేళ చేసినా అవి విధానపరంగానే ఉన్నవి. కానీ ఎన్నడూ వ్యక్తిగతంగా చేయలేదు. అదే కెసిఆర్ మాత్రం వ్యక్తిగతంగానే చేశారు. మరి ఇవి పవన్ కళ్యాణ్ కు గుర్తున్నాయో.. లేక మర్చిపోయారేమో తెలియదు కానీ.. కెసిఆర్ కుటుంబంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రశంసిస్తూనే ఉన్నారు..భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా పిలిచారు. కానీ ఇవేవీ కేసీఆర్ కు గుర్తుకు ఉండవు. ఎందుకంటే ఆయన పక్కా పొలిటికల్ కాబట్టి.
పవన్ ఆయువుపట్టుపై..
ఆంధ్రాలో కాపు కులస్తులు రాజకీయాలను ప్రభావితం చేయగలరు. సుమారు 90 సీట్లల్లో వీరు ప్రబల శక్తిగా ఉన్నారు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత చాలామంది కాపు కులస్తులు అందులో చేరారు. కానీ ఎందుకనో కొంతమంది అందులో ఇమడ లేకపోయారు. బయటకు వచ్చేసారు.. పవన్ కళ్యాణ్ పై రాళ్లు వేశారు. అయినప్పటికీ జనసేనాని ఎక్కడా వెనకడుగు వేయలేదు.. పైగా పార్టీ నడపాలంటే ఆర్థిక వనరులు ముఖ్యం కాబట్టి తాను మళ్ళీ సినిమాల్లోకి వెళ్లారు. అటు సినిమాలు చేసుకుంటూనే ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. పార్టీ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఏపీలో అడుగుపెట్టిన కేసీఆర్… ఒకప్పటి జనసేన నాయకుడు చంద్రశేఖర్ ను భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిని చేశారు.. అంతిమంగా ఇది జనసేన పార్టీపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు పోటీగా జగన్మోహన్ రెడ్డి కాపు కులస్తులను నిలపడంతో పరిస్థితి తారు మారయింది.. కాపు ఓటు బ్యాంకు చీలి వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు లాభం చేకూర్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ప్రయోగం చేస్తుండటంతో పవన్ పార్టీకి అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది.

సొంతంగా బలపడే క్రమంలో
ఏపీలో 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సొంతంగా బలపడదామనుకొని పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే బిజెపికి స్నేహ హస్తం ఇచ్చారు. అదే సమయంలో ఏపీ పునర్నిర్మాణం కోసం గతంలో ఇచ్చినట్టే టిడిపికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు.. కానీ ఆయన ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది.. కెసిఆర్ రూపంలో భారత రాష్ట్ర సమితి పవన్ కళ్యాణ్ ఆశలపై నీళ్లు చల్లే ప్రమాదం కనిపిస్తోంది.. ఈ వృత్తాంతం మొత్తం చూస్తుంటే మహాభారతంలో అశ్వద్ధామ పరిణామం గుర్తుకు వస్తోంది..మరీ ఇది పవన్ కు అర్థమైందో లేదో?