Health ATM On UP: యూపీ సీఎం యోగీ.. అంటే మనకు గుర్తుకు వచ్చేది గోవులు, ఎన్ కౌంటర్లు.. ప్రత్యర్థులకు కౌంటర్లు.. కానీ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి తన స్టైల్ మార్చారు.. బీమారి రాష్ట్రంగా పేరుపొందిన ఉత్తరప్రదేశ్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఆయన ప్రజారోగ్యంపై దృష్టి సారించారు. అందులోనూ విప్లవాత్మకమైన పద్ధతులకు నాంది పలికారు.

సరికొత్త నిర్ణయం
కోవిడ్ ప్రబలినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. చాలాచోట్ల బెడ్లు దొరకక రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో యోగి పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గతంలో ఘోర క్ పూర్ లో ని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ లభించక చాలామంది పిల్లలు చనిపోయారు.. అప్పుడు కూడా యోగి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.. ఈ క్రమంలో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు.. ప్రజారోగ్యంపై దృష్టి సారించారు.. ఇందులో భాగంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4600 హెల్త్ ఏటీఎం లు, వెల్ నెస్ సెంటర్లు, మెడికల్ కాలేజీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. అంతేకాదు హెల్త్ ఏటీఎంల దగ్గర ప్రజలకు సహాయం చేసేందుకు సిబ్బందిని నియమించే ప్రక్రియ ప్రారంభించామని ఆయన వివరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి సర్కార్ ఆరోగ్యం,లా అండ్ ఆర్డర్, టూరిజం, విద్య, మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి పెడుతోంది.
వీటి వల్ల ఏం జరుగుతుంది
ఇప్పటివరకు నగదు ఏటీఎంలు, గోల్డ్ ఏటీఎంల గురించి మాత్రమే మనకు తెలుసు.. కానీ ఉత్తర ప్రదేశ్ వాసులకు యోగి హెల్త్ ఏటీఎంలను పరిచయం చేస్తున్నారు.. బహుశా దేశంలోనే ఈ విధానం ప్రథమం. మధురలో దీనిని ఏర్పాటు చేశారు.. ఈ హెల్త్ ఏటీఎం 23 రకాల వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు చేయగలదు.. పని కూడా 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.. ఒకవేళ మనం ఆసుపత్రికి వెళ్తే ఈ తతంగం మొత్తం పూర్తయ్యేందుకు రోజంతా పడుతుంది.. రిపోర్టుల కోసం ల్యాబ్ ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. కానీ హెల్త్ ఏటీఎం వెంటనే పరీక్షలు చేయడమే కాదు… రోగులకు చికిత్స కూడా చేయగలదు.

ఎలా పని చేస్తుంది?
బ్యాంకుల్లో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ మాదిరి హెల్త్ ఎటిఎం కూడా ఒక కియోస్క్.. దీనికి టచ్ స్క్రీన్ ఉంటుంది.. ఇందులో ఆరోగ్య సంబంధిత సమాచారం ఉంటుంది.. ఇది కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్వేర్ తో పనిచేస్తుంది. ఇంటర్నెట్ ద్వారా రోగుల ఆరోగ్య సమాచారాన్ని ఈ యంత్రం గ్రహించగలదు.. ఈ హెల్త్ ఏటీఎం కేంద్రంలో ప్రపంచస్థాయి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయి. జిల్లాలు, గ్రామాల్లో ఆరోగ్య సమస్యలను ఇది పరిష్కరించగలదు.. దీని వాడకం, కచ్చితత్వంతో ఉంటుంది. కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనరీ టెస్టులు, గైనకాలజీ, క్లినికల్ డయాగ్నస్టిక్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ సర్వీసులను ఈ కియోస్క్ నుంచి పొందవచ్చు.
ఇలా ఆపరేట్ చేయాలి
ఏటీఎం కేంద్రంలో కొన్ని రకాల వైద్య పరికరాలు ఉంటాయి.. టెస్టుల కోసం వెళ్లిన వారికి ఎలాంటి పరీక్ష చేయాలో అలాంటి పరికరాన్ని ఉపయోగించి వైద్య సిబ్బంది టెస్టులు చేయిస్తారు.. ఏటీఎం నుంచి టెస్టుల ఫలితాలు రాగానే సంబంధిత మందులను పేషెంట్లకు ఇస్తారు.. ఈ కియోస్క్ ఏ డాక్టర్ ని కలవాలో చెబుతుంది.. వ్యక్తుల బరువు, ఎత్తు, రక్తపోటు, రక్తంలో గ్లూకోస్ లెవెల్, శరీర ఉష్ణోగ్రత, బాడీ మాస్ ఇండెక్స్, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, కండరాల బలం, వేలిముద్రలు, ఈసీజీ పల్స్ రేట్, బాడీలో కొవ్వు శాతం, ఆక్సిజన్ లెవెల్స్ వంటి వివరాల్ని ఈ ఏటీఎం ద్వారా పొందవచ్చు.. అంతేకాదు ఈ కియోస్క్ ద్వారా డాక్టర్ తో లైవ్ వీడియో కన్సల్టేషన్ పొందవచ్చు.. అంతేకాదు ఏ మందులు వాడాలో కూడా చెబుతుంది.. కొన్ని రకాల మందుల్ని అప్పటికప్పుడు ఇస్తుంది. ఈ కియోస్కు యంత్రాల ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో చూశాం కదా… ఇలాంటి వాటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ప్రజలకు చక్కటి వైద్య సదుపాయాలు అందుతాయి. వైరల్ ఫీవర్ల వంటి వాటిని వెంటనే తగ్గించే వీలు వీటి ద్వారా ఉంటుంది. ముంబై కి చెందిన యోలో హెల్త్ ఈ ఏటీఎంలను సప్లై చేస్తున్నది. ఇప్పటివరకు వేయికి పైగా ఏటీఎంలను సప్లై చేసింది. మరిన్ని సప్లై చేసేందుకు సిద్ధం అవుతోంది.