Online Shopping: స్మార్ట్ ఫోన్లు చేతికి రాకముందు, అమేజాన్ ఇండియాకు రాకముందు ఏ వస్తువు కొనాలన్నా మార్కెట్ లేదంటే షాపుల వద్దకు వెళ్లి కొనుక్కునే వాళ్లం. అయితే వీటిలో అవసరం ఉన్నదాన్ని మాత్రమే కొనుగోలు చేసేవాళ్లం. ఇంట్లో అవసరం లేని వస్తువును కనీసం చూసే వాళ్లం కూడా కాదు.. షాపులు కూడా అలాగే ఉండేవి. ఆ తర్వాత సూపర్ మార్కెట్లు, డీమార్టులు రావడంతో పెద్దగా అవసరం లేని సామగ్రి కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. ఇక స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చి ఆన్ లైన్ షాపింగ్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఇష్టం వచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. అయితే పదే పదే షాపింగ్ చేయడం మంచిది కాదని ఆర్థిక నిపుణులతో పాటు సైకాలజిస్టులు కూడా సూచిస్తున్నారు.
ముంబైకి చెందిన ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ‘ఆన్‌లైన్ షాపింగ్ అడిక్షన్’ గురించి మాట్లాడారు. ‘కంపల్సివ్ బయింగ్ డిజార్డర్’ అని లేదంటే ‘ఒనియోమానియా’ అంటారని తెలిపారు. ఇది ఫైనాన్షియల్, రిలేషన్‌షిప్ ఇష్యూస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆన్‌లైన్ షాపింగ్ తక్షణం ఆనందం, ఇస్తుంది కాబట్టి వ్యసనంగా మారుతుందని చెప్తున్నారు. డెలివరీ ప్యాకేజీని ఓపెన్ చేస్తున్నప్పుడు డోపమైన్‌ను విడుదల చేస్తుందని, దీంతో మరింత షాపింగ్ చేయాలనే ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నారు.
ఎందుకు అడిక్ట్ అవుతారు
ఒక డాక్టర్ దీని గురించి చెప్తూ.. ‘మన కన్సూమర్ కల్చర్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. సేల్స్, యాడ్స్ కూడా షాపింగ్ ఎక్కువ చేసేలా ప్రేరేపిస్తాయి. ఆత్మన్యూనతతో బాధపడే వారు ఎక్కువగా దీనికి అడెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళన లేదా ఒంటరితనంను ఎదుర్కొనేందుకు షాపింగ్ చేయవచ్చు. షాపింగ్ డోపమైన్‌ను విడుదల చేస్తుంది, ఇది ప్లెజర్ కెమికల్, మాదకద్రవ్య దుర్వినియోగం లాంటి వ్యసనాన్ని సృష్టిస్తుంది.’ అని చెప్పారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఆన్‌లైన్ షాపింగ్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆర్థిక సమస్యలు, గిల్ట్, ఆందోళన, అవమానం, డిప్రెషన్‌కు కారణం అవుతుంది. తాత్కాలిక తృప్తితో మొదలయ్యే వ్యసనం సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చని హెచ్చరించారు.
ఎలా మార్చుకోవాలి..
షాపింగ్ ఎందుకు చేయాలనిపిస్తుందో తెలుసుకోవాలి. దాని నుంచి బయట పడేందుకు స్నేహితుడి గడపడం, లేదంటే ఏదైనా పని చేయడం, లేదంటే వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఒక బడ్జెట్ పెట్టుకొని అందులోనే షాపింగ్ చేయాలని పెట్టుకోండి. ఆ బడ్జెకు రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయద్దు. మీ ఖర్చులను రెగ్యులర్‌గా ట్రాక్ చేయండి.
ఈ వ్యసనానికి కారణమయ్యే ప్రమోషనల్ ఈ మెయిల్స్ అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి, షాపింగ్ యాప్‌లను ఫోన్లలో నుంచి డిలీట్ చేయాలి. షాపింగ్ అలవాట్ల గురించి తెలుసుకోవడం, ఇంపల్సివ్ బిహేవియర్ తగ్గించుకునేందుకు మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. షాపింగ్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేందుకు కొత్త హాబీలు లేదా యాక్టివిటీస్ ఫాలో అవ్వాలి. అవసరమైతే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు కంపల్సివ్ బిహేవియర్ మేనేజ్ చేసేందుకు థెరపిస్ట్‌ను కలవాలి.