
మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నైపుణ్యం ఉంటే పెద్దగా చదువు లేకపోయినా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేకపోయినా లక్షలు సంపాదించవచ్చని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్లు ఎన్నో ఉండగా అందులో లెక్కలేనన్ని వంటల ఛానెళ్లు ఉన్నాయి. చాలామంది వంటకాలను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ వంటలను చూస్తారు. అయితే 65 సంవత్సరాల వ్యక్తి ఆర్ముగం భారీస్థాయిలో వండే వంటకాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
యూట్యూబ్ ఛానెల్స్ లో ఒకటైన విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఆర్ముగం ఎక్కువగా మాంసాహార వంటకాలను చేస్తారు. వేల సంఖ్యలో కోడిగుడ్లతో పులుసు, వెయ్యి కోడి గుండెలతో గ్రేవీ కర్రీ ఇలా అతని వంటలన్నీ భారీగా ఉంటాయి. ఈ వంటలే కాక ఆర్ముగం ఎన్నో వెరైటీ వంటకాలను కూడా చేయగలరు. పల్లె వాతావరణం ఉండే ప్రాంతాల్లో వీడియోలను చిత్రీకరించేలా ఆర్ముగం తగిన జాగ్రత్తలను తీసుకుంటారు.
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం ఆర్ముగం వంటను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చీరలు అమ్మిన ఆర్ముగం ఆ తరువాత పెయింటింగ్ పనులు చేశారు. కొడుకు ప్రోత్సాహంతో ఆర్ముగం మాంసాహార వంటకాలు చేస్తుండగా ఆ వంటకాలు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్ కు నెలకు ఏకంగా మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది.
డాడీ ఆర్ముగం పేరుతో ఆర్ముగం సెలబ్రిటీ అయ్యారు. సొంతంగా 50 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవడంతో పాటు ఆర్ముగం కార్లను కూడా కొనుగోలు చేశారు. వీడియో మధ్యలో అతని కొడుకు పదేపదే డాడీ అని పిలవడంతో అతనికి డాడీ ఆర్ముగం అనే పేరు వచ్చింది.