
Chanakya Niti: ఆగాన వచ్చింది భోగాన పోతుందంటారు. అడ్డదారుల్లో అందలాలెక్కినా తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డబ్బు సంపాదనలో నీతి నిజాయితీలే ప్రామాణికం. సంఘ విద్రోహక చర్యల ద్వారా సంపాదిస్తే డబ్బు నిలవదు. పైగా పేరు చెడిపోతుంది. ఆచార్య చాణక్యుడు జీవితంలో డబ్బు ఎలా సంపాదించాలనే దానిపై స్పష్టత ఇచ్చాడు. నీతి మార్గంలోనే డబ్బు సంపాదిస్తే మంచిది. అక్రమ మార్గాల్లో సంపాదిస్తే మనకు బాధలు తప్పవు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. మనం చేసే తప్పులే మనకు అడ్డంగా నిలుస్తాయి. దీంతో డబ్బు ధర్మమార్గంలోనే సంపాదించాలి. ఖర్చు కూడా అలాగే చేయాలి.
సంపాదించిన డబ్బును అట్టి పెట్టుకోకూడదు. పలు మార్గాల్లో ఖర్చు చేస్తుండాలి. అంతేకాని ఒక సరస్సులో నీరు అలాగే ఉంటే మురికిగా మారుతాయి. అదే పారుతుంటే తెల్లగా ఉంటాయి. డబ్బు కూడా అంతే ఖర్చు పెడుతున్న కొద్ది పెరుగుతుంది. చల్లే చెలిమలోనే నీళ్లు ఊరుతాయి. అలాగే డబ్బు ఖర్చు చేసే చోటే కొత్తగా డబ్బు వచ్చి చేరుతుందని చాణక్యుడు సూచిస్తున్నాడు.
డబ్బు ఎప్పుడు కూడా బీరువాలో దాయకూడదు. కాకపోతే విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. మనం ఖర్చు చేసే డబ్బుకు అర్థం ఉండాలి. మంచి పనుల కోసం కేటాయించాలి. దానాలు చేయాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. అలా డబ్బుకు విడుదల ఉండాలి. అప్పుడే అది మళ్లీ మన దరికి చేరుతుంది. డబ్బును వినియోగంలో ఉంచాలి.

డబ్బును విరాళంగా ఇవ్వొచ్చు. పెట్టుబడి కోసం ఉపయోగించొచ్చు. బీమా, ఆరోగ్య పథకాలు, విద్యాసంస్థల్లో పెట్టుబడిగా కూడా పెట్టొచ్చు. డబ్బును ఎక్కువ కాలం ఒకే చోట ఉంచకూడదు. దానికి విడుదల ఉండాలి. ఏదో పనికి వాడాలి. ఇలా చేయడం వల్ల మనకు తిరిగి డబ్బు చేతికందుతుంది. అంతేకాని డబ్బును దాచుకుని దాన్నే చూస్తుంటే అది మన దగ్గర ఉండేందుకు ఇష్టపడదు. సాధ్యమైనంత వరకు ఖర్చు చేస్తుండాలి.
ఏ వ్యక్తి అయినా ధనవంతుడు కావాలంటే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చు చేయడం కూడా అంతేనని గుర్తించాలి. డబ్బును సరైన రీతిలో ఉపయోగిస్తే ధనవంతులు కావడం కష్టమేమీ కాదు. దానికి ప్రత్యేకంగా ఉపాయం ఏదీ ఉండదు. మనకు తోచిన విధంగా ఖర్చు చేయడం, వచ్చిన విధంగా సమకూర్చడమే ఇందులో దాగి ఉన్న రహస్యం.