
MS Dhoni IPL 2023: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, ఐపీఎల్ స్టార్ క్రికెటర్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ సీజన్ 16లో తన సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసమే చాలా మంది క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లు చూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో ఆయన టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. మూడేళ్లుగా ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతారన్న వార్తలు వస్తున్నాయి. కానీ ధోనీ వీటిగురించి పట్టించుకోకుండా తన ఆట కొనసాగిస్తున్నాడు.
మూడేళ్లుగా ఇదే చివరి ఐపీఎల్ అంటూ..
2019 ఐపీఎల్ నుంచి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ విషయం వచ్చిన ప్రతీసారి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ధోనీ ఆట మిస్ అవుతామో అని టెన్షన్ పడుతున్నారు. అయితే ప్రతీ ఆటగాడికి ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పనిసరి. కానీ కొన్ని మీడియా సంస్థలు ధోనీతో సంబంధం లేకుండా ప్రకటనలు చేస్తున్నాయి. కొంతమంది క్రికెటర్లు కూడా ఇదే లాస్ట్ సీజన్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఓ పార్టీలో వ్యాఖ్యలు..
తాజాగా ధోనీ తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని విలేకరులు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. దానికి స్పందించిన ధోనీ దానికి ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా అది జట్టుపై ప్రభావం చూపుతుందని, కోచ్‌ను ఒత్తిడికి గురిచేస్తుందని ప్రకటించారు. అయితే ఇంకా టైం ఉంది అని ధోనీ ప్రకటించడంతో ఇప్పట్లో రిటైర్మెంట్ ఉండదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

ధోనీ రిటైర్మెంట్‌పై చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్–16 సీజన్ తర్వాత ధోనీ.. ఈ మెగా టోర్నీకీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై కెప్టెన్ కూల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోనీ అభిమానులు మాత్రం ఈ వార్తలతో ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని ధోనీ రిటైర్మెంట్ గురించి అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ‘నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అందువల్ల, ధోనీ రిటైర్ అవుతాడో లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేను. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా.. వద్దా అనేది.. అతడి ఫిట్‌నెస్, ఫామ్, క్రికెట్‌లో ఇంకా కొనసాగాలనే ఆసక్తి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అని గమనించాలి. వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలి’ అని సమాధానమిచ్చింది.