Potatoes For Diabetics: ఎక్కడి నుంచి వచ్చిందో… ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ… ఆలూ అనేది మన వంటింట్లో ఒక భాగం అయిపోయింది.. పూరి లోకి కుర్మా గాను, సమోసాలోకి ఉడికించిన దుంపగాను… దోశ మీదికి మసాలా గాను.. సినిమా థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ గాను… ఒక్కటేమిటి అన్నింటిలోనూ ఆలూ ఉంది. “సమోసాలో ఆలూ ఉన్నంతవరకు.. బీహార్లో లాలూ ఉంటాడు” అని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పాడు అంటే ఆలూ ఘనత మామూలుదా? ఆలూ దుంప జాతికి చెందిన వంగడం కాబట్టి కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి.. చూసేందుకు నాజూగ్గా… ముట్టుకుంటే మెత్తగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి మంచిది అనుకోవద్దు.. అలాగని చెడ్డదని దూరం పెట్టొద్దు.. మితంగా తింటే ఏదైనా బాగానే ఉంటుంది. అదే హద్దు దాటితే.. చెప్పేదేముంది ఆసుపత్రి పాలు కావటమే.

టైప్ 2 డయాబెటిక్ ముప్పు
ఆలుని ఆలూ తీరుగా వాడుకుంటే వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. పుర్రెకో బుద్ధి… జిహ్వ కో రుచి అన్నట్టు.. ఆలు మీద రకరకాల ప్రయోగాలు చేసి నచ్చినట్టు, నాలుక మెచ్చినట్టు తింటే రకరకాల రోగాలు వస్తున్నాయి. ప్రధానమైనది టైప్ 2 డయాబెటిక్.. మొన్నటిదాకా ఈ వ్యాధి ఆలుగడ్డల ద్వారా కూడా సోకుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. అయితే దీనిపై ఆస్ట్రేలియా దేశానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఆలుగడ్డతో అంత ప్రమాదం లేదని, కానీ అదే ఆలుగడ్డను ఉడికించకుండా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా రకరకాల వంటకాలు చేసుకొని తింటేనే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. నగరీకరణ పెరిగిన తర్వాత పాశ్చాత్య సంస్కృతి చొచ్చుకొని వస్తోంది. అందులో భాగంగా దుంప జాతికి చెందిన ఆలుగడ్డలతో రకరకాల వంటకాలు, ఫాస్ట్ ఫుడ్.. ఇలా ఆహారంలో ఒక భాగం అవుతున్నాయి. ఇందులో రకరకాల కొవ్వు పదార్థాలు యాడ్ చేస్తుండడంతో అవి శరీరాన్ని ఊబకాయంగా మార్చుతున్నాయి.. ఆ ఊబకాయం కాస్త మధుమేహానికి దారితీస్తోంది.
కార్బోహైడ్రేట్లు మంచివే కానీ
దుంప జాతికి చెందిన కూరగాయల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. శరీర అభివృద్ధికి కార్బోహైడ్రేట్లు అవసరమే. కానీ అది పనిగా తింటే శరీరంలో కేలరీలు పెరిగిపోయి అవి ఖర్చు కాక మధుమేహం వస్తుంది.. అదే సమయంలో క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. ఇది అంతిమంగా శరీరంపై ప్రభావం చూపిస్తుంది.. అయితే చాలామందిలో ఆలుగడ్డ తింటే మధుమేహం వస్తుందని అపోహ ఉంది.. కానీ దీనిని వైద్యులు కొట్టి పారేస్తున్నారు. “ఆలుగడ్డ అనేది ఒక దుంప జాతికి చెందిన కూరగాయ కాబట్టి.. అందులో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరం. అలాగని అమితంగా తింటే ఇబ్బందికరమని” వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలుని మితంగా తినాలని, ఇదే సమయంలో బ్రకోలి, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుళ్ళ జాతులకు చెందిన కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎలా తినాలి
ఆలు అంటే ఇష్టం ఉన్నవారు కూరగా మాత్రమే చేసుకొని తినాలి. ముఖ్యంగా ఆ దుంపను బాగా ఉడికించాలి. చీజ్, కొవ్వు బాగా ఉండే బట్టర్, పన్నీర్ వంటి వాటిని బంగాళదుంపతో కలిపి వండకూడదు. దీనివల్ల అధిక కేలరీలు పెరిగిపోయి శరీరంలో కొవ్వు ఏర్పడేందుకు ఆస్కారం కలుగుతుంది. పైగా ఈ కొవ్వులను శరీరం శోషించుకోలేక రక్తనాళాల్లో పేరుకు పోతుంది. ఇది ఇలా మధుమేహానికి దారితీస్తుంది. ప్రస్తుతం టైప్ 2 మధుమేహం పెరిగేందుకు వ్యాయామలేమి, ఫాస్ట్ ఫుడ్ తినడం, జన్యుపరమైన కారణాలు వంటివి దోహదం చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే రోజు తీసుకునే ఆహారంలో సమతుల్యాన్ని పాటించే వారిలో డయాబెటిక్ వచ్చే ముప్పు 21 శాతం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే రోజు మనం తీసుకునే ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రాసెస్డ్ మీట్, షుగర్, కొవ్వు పదార్థాలు బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.