Gujarat Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుచూపిన నేపథ్యంలో ఇవే నిజమవుతాయని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే బిజెపి వరసగా ఏడోసారి విజయంతో పశ్చిమ బెంగాల్లోని వామపక్షల రికార్డు సమం చేసే అవకాశం ఉంది.

గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈసారి 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.. 70 రాజకీయ పార్టీలు, 624 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు మ్యాజిక్ మార్క్ 92. బిజెపి, కాంగ్రెస్, ఆప్, బి.ఎస్.పి నుంచి 101 మంది, భారతీయ ట్రైబల్ పార్టీ నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 37 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2017లో ఇక్కడ బిజెపి 99, కాంగ్రెస్ 77, బి టి పి రెండు, ఎన్సిపి ఒకటి, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు.
ప్రతిపక్షానికి అవకాశం ఇస్తుందా
ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పట్టంకట్టే హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో ఆసక్తికరంగా మారింది.. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈసారి ఆ సాంప్రదాయం మారే అవకాశం కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ ఓటర్లు ఎందుకో ఈసారి మళ్లీ కమలం వైపే మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. స్థానికంగా నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ, జాతీయ స్థాయి నాయకులు ఎవరు కూడా ప్రచారానికి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. పోల్ మేనేజ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో బిజెపి చివరి దశలో పుంజుకుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.. మొదట్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నా, చివరికి బిజెపి దూకుడు ప్రదర్శించిందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని తేల్చి చెప్పాయి.

సంప్రదాయం మారాలి
గుజరాత్ రాష్ట్రంలో మోడీ వ్యక్తిగతంగా చేపట్టిన ప్రచారంతో గెలుపు తమనే వరిస్తుందని బిజెపి నాయకులు ధీమాతో ఉన్నారు.. ఈసారి పాలన కాదు. సంప్రదాయం మారాలి అనే నినాదాన్ని ఆ పార్టీ హోరెత్తించింది.. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ సంప్రదాయాన్ని తిరగరాసింది.. ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే జరుగుతుందని, ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, సిపిఎస్ వంటి ప్రధాన సమస్యలు తమకు పట్టం కడతాయని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అయితే ఫలితాలు పోటాపోటీగా ఉంటాయనే ఆలోచనతో ఈ రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో క్యాంపు రాజకీయాలకు సన్నాహాలు చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ మార్క్ 35. ఎన్నికల్లో బిజెపి 44 స్థానాలు సాధించింది.. కాంగ్రెస్ 21 స్థానాలతో సరిపెట్టుకుంది. సిపిఎం ఒక సీటు సాధించింది. స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. అయితే గుజరాత్ ఎన్నికను మాత్రమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి.. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది..