
Australia vs India 1st Test 2023: సరైన టీం తగలాలే గాని ఆస్ట్రేలియా ఓడిస్తే ఓడిపోనంత గట్టి జట్టేం కాదు.. దీనిని టీమిండియా నిరూపించింది.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ లోని విదర్భ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆల్ ఔట్ అయిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్ లో 91 ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా వెన్ను విరిస్తే… రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను పేక మేడలా కూల్చేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా… ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. మైదానం నిర్జీవంగా మారడం, స్పిన్నర్లకు అనుకూలంగా మారడం తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్లతో బౌలింగ్ ప్రారంభించాడు.. అతడి అంచనాలకు తగ్గట్టుగానే స్పిన్నర్లు కూడా వికెట్లు రాబట్టారు.. ముఖ్యంగా అశ్విన్ దాటికి ఆస్ట్రేలియా చీగురుటాకులా వణికి పోయింది. ఏ ఒక్కరు కూడా అతడిని ప్రతిఘటించలేకపోయారు.. ఏడు పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లాబు షేన్, డేవిడ్ వార్నర్, రెన్ షా, హ్యాండ్స్ కాబ్, క్యారీ, కమిన్స్, ముర్ఫే, లయన్, బోలాండ్.. వచ్చినవారు వచ్చినట్టే ఫెవిలియన్ చేరారు.. రెండో వికెట్ కు జోడించిన 19 పరుగులే అత్యధిక భాగస్వామ్యం అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. అశ్విన్ బౌలింగ్ లో బంతిని టచ్ చేసేందుకే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ భయపడ్డారు.. 12 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్… 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ లో స్మిత్ మాత్రమే 25 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. వారంతా స్వల్ప స్కొర్లకే వెనుతిరిగారు.
జడేజా మొదలు పెట్టాడు అశ్విన్ ముగించాడు
ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 177 పరుగులకు ఆల్ ఔట్ చేయడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు.. ఆ తర్వాత అతడు బ్యాట్ తోనూ మెరిశాడు. భారత జట్టు భారీ స్కోర్ సాధించడంలో సహాయపడ్డాడు.. ఇతడికి అక్షర్ పటేల్ కూడా తోడు కావడంతో భారత జట్టుకు కలిసి వచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను అశ్విన్ పేక మేడలా కూల్చేశాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించాడు. నిర్జీవమైన గ్రౌండ్ మీద వికెట్లు రాబట్టడంలో సిద్ధహస్తుడైన అశ్విన్.. మరొకసారి తన మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించాడు. బంతిని గింగిరాలు తిప్పి కంగారులను మరింత కంగారుపెట్టాడు. మొత్తానికి టీం ఇండియాకు ఇన్నింగ్స్ 132 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓటమిపై సోషల్ మీడియాలో మీమ్స్ చెలరేగుతున్నాయి. మొదటి టెస్టులోనే ఇలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా మిగతా మ్యాచ్లో ఎలా ఆడుతుందో వేచి చూడాలి.

ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో పలు కీలకమైన క్యాచ్ లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు జారవిడిచారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇచ్చిన రెండు క్యాచ్ లను స్మిత్ జారవిడిచాడు.. ఇది ఎంతటి మూల్యానికి దారి తీసింది తర్వాత కానీ ఆస్ట్రేలియాకు అర్థం కాలేదు.. రెండు జీవధానాలను తనకు అనుకూలంగా మార్చుకున్న రోహిత్ శర్మ సెంచరితో చెలరేగిపోయాడు. టీమిండియా ఫలితంగా భారీ స్కోరు సాధించింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఫీల్డర్లు ఆ క్యాచులు గనుక పట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. సిరీస్ ప్రారంభం ముందే ఆస్ట్రేలియా ఎదుట టీం ఇండియా అనుతుందా అని వ్యాఖ్యలు చేసిన వారు… ఇప్పుడు రోహిత్ సేన సాధించిన విజయాన్ని చూసి నోళ్లు మూసుకున్నారు.