Food safety alert Hyderabad: హైదరాబాద్ కు ఇతర ప్రాంతాలు వారు రాగానే ముందుగా ఆకలేస్తుంది. ఎందుకంటే రుచికరమైన బిర్యాని ఇక్కడ లభిస్తుంది. అలాగే నాణ్యమైన రెస్టారెంట్స్ ఇక్కడ ఉంటాయని చాలామంది భావన. అందుకే ఏ పని మీద అయినా హైదరాబాద్ కు వచ్చిన వారు రుచికరమైన ఫుడ్ టేస్ట్ చూడకుండా తిరిగి వెళ్ళరు. అయితే ప్రస్తుత కాలంలో హైదరాబాదులో ఏదైనా తిందామంటే భయపడిపోతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో సరఫరా చేసే ఆహార పదార్థాల్లో ఊహించని మలినాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక రెస్టారెంట్లో సరఫరా చేసిన ఆహారంలో ఎలుకల మలం కనిపించింది. దీనిని చూసిన వినియోగదారులు షాక్ తిన్నారు. మరోసారి ఇక్కడ ఏదైనా తినగలమా? అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
వర్షాకాలం కావడంతో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహార పదార్థాలను వన్డే ప్రాంతంలో స్వచ్ఛత లేకపోతే అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని అబ్సెల్యూట్ బార్బెక్యూ కు చెందిన పది రెస్టారెంట్లలో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిచెన్లో అధికారులు తనిఖీలు చేయగా ఎలుకల మలం కనిపించింది. ఇవి ఆహార పదార్థాలపై నిలిచి ఉన్నాయి. అలాగే ఫ్రిజ్లో రోజుల తరబడి ఆహారాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇందులో కుళ్ళిపోయిన పండ్లు.. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన కొన్ని ఆహార పదార్థాలు లభించాయి. దీంతో ఈ రెస్టారెంట్లపై చర్యలు తీసుకునేందుకు నోటీసులను అందించారు.
కేవలం ఈ రెస్టారెంట్లలో మాత్రమే కాకుండా చాలా రెస్టారెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అధికారులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కుళ్ళిపోయిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు లభిస్తూనే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల వినియోగదారులు రెస్టారెంట్లోకి వెళ్లే ముందు ఆలోచించాలని సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం రైన్ సీజన్ కావడంతో ఇలాంటి కుళ్ళిపోయిన ఆహారం తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల కు ఇవి తినిపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.
కొన్ని రెస్టారెంట్లో పాడైపోయిన ఆహారం మంచి రుచిగా రావడానికి ఫుడ్ కలర్ వాడుతూ ఉన్నారని.. కొందరు టేస్టీ పౌడర్ వేసి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు కిడ్నీపై ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సాధ్యమైనంతవరకు వానాకాలంలో ఇంట్లోనే ఆహారం తయారు చేసుకోవాలని.. రెస్టారెంట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని అంటున్నారు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాకుండా ప్రతి పదార్థం పాడైపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.