కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు రాలేదు. అయితే కేంద్రం సూచనల మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించి ప్రజలకు శుభవార్త చెప్పాయి.
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అండమాన్ నికోబార్ లో తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుండటం గమనార్హం. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 82.96 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 77 రూపాయలుగా ఉంది. ఇటానగర్ లో లీటర్ పెట్రోల్ ధర 92 రూపాయలుగా ఉంది. ధరల వ్యత్యాసం వల్ల కొన్ని రాష్ట్రాల పెట్రోల్ బంకుల యజమానులు భారీ మొత్తంలో నష్టపోతున్నారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైనా కారణం చేత ఇతర రాష్ట్రాలకు వ్యక్తిగత వాహనాలలో వెళుతున్న ప్రయాణికులు అక్కడ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే లీటర్ పెట్రోల్ ధర 108.20 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 94.62 రూపాయలుగా ఉంది. ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా ఇదే విధంగా ఉన్నాయి.
అయితే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరగనుందని తెలుస్తోంది.