India U19 Cricket : సమర్ధుడు ఉంటే ఎక్కడైనా సరే విజయాలు లభిస్తాయి. ఆ సమర్ధుడు ఇప్పుడు భారత అండర్ 19 జట్టుకు శిక్షకుడిగా వచ్చాడు. జట్టులో ఉన్న లోపాలను బయటకు తీశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆడాలి.. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా అనుకూలంగా మార్చుకోవాలి.. కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి.. ఇలా ప్రతి విషయంలోనూ ఆటగాళ్లకు అద్భుతమైన శిక్షణ ఇచ్చాడు. ఆశిక్షణలో ఆటగాళ్లు రాటు తేలిపోయారు. అందువల్లే పాకిస్తాన్ చేతిలో వరుసగా ఎదురైన ఓటములకు ఆదివారం నాటి మ్యాచ్లో అద్భుతమైన గెలుపు సాధించి.. ప్రతీకారం తీర్చుకున్నారు.
బులవాయో లో ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భారత జట్టుపై అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు కావడంతో ఎక్కడో ఒక మూల భయం ఉన్నది. ఈ దశలో పాకిస్తాన్ ప్లేయర్లు ఏదైనా చేస్తారని.. టీమిండియా ప్లేయర్లను ఒత్తిడిలోకి నెడతారని అందరు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే చేజింగ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు మూడో వికెట్ వరకు ఏకంగా 150+ పరుగుల వరకు జట్టు స్కోరును నడిపించారు. ఇంకేముంది ఓటమి తప్పదని అందరూ ఒక అంచనాకొచ్చారు.
ఈ దశలో భారత ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించడం మొదలుపెట్టారు. సానుకూల దృక్పథం వైపు అడుగులు వేశారు. చూస్తుండగానే పాకిస్తాన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. అంతేకాదు సాధ్యం కాదు అనుకున్న విజయాన్ని చేసి చూపించారు. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదు.. అండర్ 19 వరల్డ్ కప్ లో దర్జాగా సెమి ఫైనల్ దాకా వెళ్లారు..
భారత యువకులలో ఈ స్థాయిలో పోరాట స్ఫూర్తి నింపిన ఆ వ్యక్తి పేరు వివిఎస్ లక్ష్మణ్. ఈ పేరు గురించి.. ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో ఎటువంటి ప్రమాణాలను లక్ష్మణ్ నెలకొల్పాడో ఇప్పటికీ కథలు కథలు గా చెప్పుకుంటారు. అతడి నేర్పరితనం.. సానుకూల దృక్పథం.. ఒత్తిడిలో సైతం స్థిరచితాన్ని కోల్పోని స్థైర్యం.. ఇవన్నీ కూడా భారత యువజట్టు రాతను మార్చేశాయి. అందువల్లే భారత జట్టు అండర్ 19 వరల్డ్ కప్ లో సత్తా చూపించింది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏకంగా సెమి ఫైనల్ దాకా వెళ్ళింది.
అండర్ 19 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా వరుసగా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఒక రకంగా అంతర్జాతీయంగా పరువు తీసుకుంది. సీనియర్ పురుషుల జట్టు వరుసగా విజయాల సాధిస్తుంటే.. జూనియర్ జట్టు మాత్రం ఓటములు ఎదుర్కొంది. అయితే ఈ ఓటములకు వివిఎస్ లక్ష్మణ్ చరమగీతం పాడాడు. తన ఆధ్వర్యంలో ఆటగాళ్లను అద్భుతంగా రాటు తేల్చి.. సరికొత్త శక్తులుగా తీర్చిదిద్దాడు. అందువల్లే అండర్ 19 జట్టు ప్రస్తుతం భీకరంగా కనిపిస్తోంది. దీని వెనక శాంతమైన వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు.