Tamil Nadu politics : తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విజయ్ కి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని గవర్నర్ ఇవ్వలేదు. దీంతో తనకున్న బలంతో పాటు.. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అవి పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు.
విజయ్ ప్రమాణస్వీకారం రద్దయిన నేపథ్యంలో.. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తాను చెప్పే వరకు అక్కడ నుంచి రావద్దని ఆ ఎమ్మెల్యేలకు విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పైగా పార్టీకి సంబంధించిన కీలక నాయకులు రిసార్ట్లోనే ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలను బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. మిగతా పార్టీల అధ్యక్షులు కూడా దాదాపుగా అలాగే వ్యవహరిస్తున్నారు..
టి వి కే విజయ్ కి ఏఐడీఎంకె సపోర్ట్ ఇస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. అవి వాస్తవం కాదని తేలిపోయింది. సంప్రదింపులు జరిగినప్పటికీ.. అవి పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం డీఎంకే, ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ రెండు పార్టీల సంబంధించిన కొంతమంది నేతలు రహస్య ప్రాంతాలలో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాలలో డీఎంకే 59, ఏఐడీఎంకె 47 స్థానాలను సాధించాయి. ఈ రెండు పార్టీల స్థానాలు కలిపితే 106 సీట్లు అవుతాయి. మరో 12 సీట్ల కోసం వామపక్షాలు, ఐయూఎంఎల్, వీసీకే సపోర్ట్ చేస్తాయని ఏఐడీఎంకే, డీఎంకే నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిగా ఏఐ
డీఎంకే నేత పలని స్వామి అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే సిద్ధాంతల పరంగా ఒకే విధమైన పార్టీలు అయినప్పటికీ.. వేరువేరు లక్ష్యాలతో ఇవి రెండు ప్రయాణం సాగిస్తున్నాయి. తమిళనాడులో ఈ రెండు పార్టీలు కూడా బద్ధ వ్యతిరేకంగా ఉంటాయి. అటువంటిది ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.