Homeఅంతర్జాతీయంTANA New Jersey : ప్రకృతితో అడుగులు.. అనుబంధాలతో ప్రయాణం.. తానా న్యూజెర్సీ ‘హైకింగ్-26’కు విశేష...

TANA New Jersey : ప్రకృతితో అడుగులు.. అనుబంధాలతో ప్రయాణం.. తానా న్యూజెర్సీ ‘హైకింగ్-26’కు విశేష స్పందన

TANA New Jersey : హిల్స్‌బరో టౌన్‌షిప్ (న్యూజెర్సీ): నగర జీవితపు హడావుడికి కాసేపు విరామం ఇచ్చి, పచ్చని ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) న్యూజెర్సీ విభాగం నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకుంది. “Better Tomorrow Begins with a Step” అనే సందేశంతో జూలై 11 శనివారం ఉదయం హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్‌లాండ్ మౌంటెన్ ట్రయిల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రకృతి మధ్య ఆరోగ్యానికి ఒక అడుగు

దట్టమైన అడవులు, రాతి మార్గాలు, పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలుల మధ్య సాగిన ఈ హైకింగ్ పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని అందించింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ట్రయిల్‌పై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పలువురు కొత్త స్నేహితులను సంపాదించగా, మరికొందరు అందమైన క్షణాలను కెమెరాల్లో బంధించుకున్నారు. తొలిసారి హైకింగ్‌కు వచ్చిన వారికీ అనుభవజ్ఞుల సహకారంతో ట్రయిల్‌ను పూర్తి చేసే అవకాశం లభించింది.

భద్రతకు అత్యంత ప్రాధాన్యం

హైకింగ్ ప్రారంభానికి ముందు నిర్వాహకులు ట్రయిల్ వివరాలు, అనుసరించాల్సిన జాగ్రత్తలు, వేసవి కాలంలో ఆరోగ్య పరిరక్షణ సూచనలను వివరించారు. అనంతరం వార్మప్ వ్యాయామాలు నిర్వహించి, గ్రూప్ ఫొటోతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో తానా న్యూజెర్సీ బృందం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. పార్కింగ్ నుంచి ట్రయిల్ మార్గదర్శనం వరకు ప్రతి అంశాన్ని సమన్వయం చేస్తూ ట్రయిల్ పొడవునా వాటర్ స్టేషన్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన వలంటీర్లు ప్రతి బృందంతో కలిసి నడుస్తూ ఎవరూ వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆకట్టుకున్న యువత సేవలు

ఈ కార్యక్రమంలో యువ వలంటీర్ల పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రయిల్ మార్గనిర్దేశం, వాటర్ స్టేషన్ల నిర్వహణ, పాల్గొన్న వారికి సహాయం చేయడం వంటి బాధ్యతలను వారు సమర్థంగా నిర్వహించారు. డిజిటల్ ప్రపంచానికి కాస్త దూరంగా ప్రకృతి మధ్య గడపడం మానసిక ప్రశాంతతను పెంచడంతో పాటు కుటుంబాల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హైకింగ్ కోఆర్డినేటర్ దశరథ తలపనేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి ధన్యవాదాలు తెలిపారు. తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి, ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నారెపాలెపు, కోశాధికారి రాజా కసుకుర్తి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, శ్యామ్ ప్రసాద్ అంబటి సహా సమన్వయ బృందం, యువ వలంటీర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

హైకింగ్ అనంతరం పాల్గొన్న అందరికీ రుచికరమైన అల్పాహారం అందించారు. ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం – శివ విష్ణు ఆలయం ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, నాగేంద్ర అందించిన సహాయ సహకారానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తానా నాయకత్వం ప్రశంసలు

కుటుంబ సమేతంగా ప్రకృతికి చేరువ చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూజెర్సీ తానా బృందాన్ని తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా బోర్డు చైర్మన్ డా. శ్రీనివాస్ నాగేంద్ర కొడాలి ప్రత్యేకంగా అభినందించారు.

అమెరికాలో తెలుగు కుటుంబాల మధ్య ఆరోగ్య చైతన్యం, సాంస్కృతిక అనుబంధాలు, సామాజిక బంధాలను మరింత బలోపేతం చేసే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ న్యూజెర్సీ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తానా స్థానిక నాయకత్వం వెల్లడించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular