Cash for vote case latest news: తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య రాజకీయంగా విభేదాలు మరింత పెరిగిపోయాయి. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా సవాళ్లు విసురుకున్నారు. రాజకీయంగా ఒకరిని ఒకరు దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అప్పట్లో చంద్రబాబును కేసీఆర్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వార్తలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహాయ సహకారాలు అందించారని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. ఈ ఓటమిని కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గా అభివర్ణించుకున్నారు. ఆ తదుపరి మారిన రాజకీయ పరిణామాలను చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏకంగా కూటమిని ఏర్పాటు చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ లో అధికారంలోకి వచ్చింది.
అప్పట్లో జరిగిన ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ ఇప్పుడు విచారణకు వచ్చింది. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఏ 4 జెరూసలెం మత్తయ్య గురువారం హైదరాబాదులో సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు రేవంత్ భార్య తనకు ఫోన్ చేశారని.. ఏసీబీకి సరెండర్ అయితే తన భర్త అదే ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నారని తనతో అన్నారని మత్తయ్య పేర్కొన్నారు.. అయితే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించిన మరుసటి రోజు అంటే శుక్రవారం ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
ఓటుకు నోటు కేసులో a4 గా ఉన్న మత్తయ్యకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసు నుంచి ఆయనను తప్పిస్తూ 2016 లోనే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘకాలం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. శుక్రవారం ఈ కేసు బెంచ్ మీదికి వచ్చింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కీలకతీర్పును వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 22న తుది వాదనలు ఈ కేసుకు సంబంధించి ముగిశాయి.. నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసు నుంచి ఆయనను తప్పించడం సమంజసమేనని పేర్కొంది. దీంతో జెరూసలేం మత్తయ్య కు ఊరట మాత్రమే కాదు, భారీ సాంత్వన కూడా లభించింది. అయితే తదుపరి సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు చెబుతుందనేది చూడాల్సి ఉంది.