Perni Nani comments on Balayya: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలకు దారితీస్తున్నాయి. వైసిపి హయాంలో సినీ పరిశ్రమ పెద్దలు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే క్రమంలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో ప్రస్తావించారు బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. అప్పట్లో చిరంజీవి ఎంతగానో గట్టిగా కోరితేనే జగన్మోహన్ రెడ్డి కదిలారని చెప్పగా.. అది తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ. నాడు ఎవరూ ఏమీ కోరలేదని ఆయన తేల్చి చెప్పారు. తనను పిలిచారని.. ఆ సైకోను కలవడం తనకు ఇష్టం లేదని తేల్చేశారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రకటన విడుదల చేశారు. ఆ సమయంలో తాను రిక్వెస్ట్ చేస్తేనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సాయం పొందారని..
అఖండ( akhanda) సినిమా విడుదల సమయంలో నందమూరి బాలకృష్ణ తనకు ఫోన్ చేసినట్లు పేర్ని నాని తెలిపారు. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తనకు ఫోన్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారని.. తాను అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పగా.. బాలకృష్ణ నన్ను కలవడం అగౌరవంగా ఉంటుందని చెప్పి.. ఏదైనా ఉంటే చేసి పెట్టండి అంటూ తమకు సూచించినట్లు పేర్ని నాని తెలిపారు. అటువంటి మంచి మనిషి పై సైకో వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ నిజమైన సైకోగా పేర్ని నాని అభివర్ణించారు. ఇది తన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులు గొప్పవారని.. అటువంటి వారికి జన్మించిన బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
రాజశేఖర్ రెడ్డి అలా కాపాడారని..
మరోవైపు నందమూరి బాలకృష్ణ కు( Nandamuri Balakrishna) యావజ్జీవ శిక్ష పడకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి కాపాడారని గుర్తు చేశారు పేర్ని నాని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఓ సినీ నిర్మాత పేరు అప్పుడు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో ఒడిస్సా కు చెందిన సెక్యూరిటీ గార్డ్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా బాలకృష్ణ సోదరి పురందేశ్వరి రాజశేఖర్ రెడ్డి సాయంతో కేసు లేకుండా చేసుకున్నారనేది ఒక ప్రచారం. ఇప్పుడు అదే విషయాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి జైలు పాలు కాకుండా కాపాడితే… జగన్మోహన్ రెడ్డి సినిమాలపరంగా అవకాశం ఇస్తే.. బాలకృష్ణ ఈ మాదిరిగా మాట్లాడడం తగదని హితువు పలికారు. మొత్తానికి అయితే బాలకృష్ణ కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి.
అఖండ సినిమా కోసం బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడారు… జగన్ సమయం అడిగారు. జగన్ తండ్రి కూడా మీకు సహయం చేయలేదా… మనిషి ఎవరైనా అలాంటి సహయం మర్చిపోతారా?
– బాలకృష్ణపై పేర్ని నాని ఫైర్ pic.twitter.com/mEG4rf0JcR
— Telugu360 (@Telugu360) September 26, 2025