SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు వరుసగా ఐదు విజయాలు సాధించింది హైదరాబాద్ జట్టు. ఏకంగా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇంతటి స్థాయి ఉన్న జట్టు ఓటమి సాధిస్తుందని ఎవరైనా అనుకుంటారా.. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఆట తీరు చూస్తే దారుణంగా అనిపించింది. హైదరాబాద్ జట్టు ఓడిపోయిన తీరు బాధ కలిగించింది.
హెడ్(61), ఇషాన్ కిషన్ (42) మినహా మిగతా ప్లేయర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు.. ఏ ఒక్క ఆటగాడు కూడా గట్టిగా నిలబడలేకపోయాడు. ఈ ఓటమి తర్వాత హైదరాబాద్ జట్టులో మిడిల్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉందో అర్థమైంది.. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపించింది.. క్లాసెన్(11) ఆకట్టుకోలేకపోయాడు.. రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2), కమిన్స్(10), శివాంగ్ కుమార్ (1) అట్టర్ ప్లాప్ అయ్యారు.
ఈ ఓటమి హైదరాబాద్ జట్టుకు గట్టి పాఠాలే నేర్పింది. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు సాధించిన విజయాలలో ఎక్కువ శాతం ఘనత ఓపెనర్లకే దక్కుతుంది. కొన్ని సందర్భాలలో బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కానీ ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు నుంచి మిడిల్ ఆర్డర్ గొప్పగా ఆకట్టుకున్న సందర్భాలు అంతగా లేవు. అయితే ఆదివారం నాటి మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ కు ఆ అవకాశం వచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు. కోల్ కతా బౌలర్ల ముందు తేలిపోయారు. కనీసం క్రీజ్ లో నిలబడే సాహసం కూడా చేయలేకపోయారు.. దీంతో హైదరాబాద్ జట్టు బలహీనత మరోసారి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. అందువల్లే కోల్కత్తా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి పదునైన బంతులు వేసి హైదరాబాద్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఈ మ్యాచ్లో ఓటమి మామూలుది కాదు. ఎందుకంటే 2024 లో కూడా హైదరాబాద్ జట్టు ఇలానే దూసుకుపోయింది. చివర్లో కోల్కతా చేతిలో భంగపాటుకు గురైంది. ఇప్పుడు కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ జట్టు.. కోల్కతా చేతిలో తలవంచింది. ఇలాంటి ఓటమి ఏ జట్టుకైనా గొప్ప పాఠాలను చెబుతుంది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు కూడా ఈ పాఠాలను నేర్చుకోవాలి. లేకపోతే ఇంతకాలం సాధించిన వరుస విజయాలకు సార్ధకత ఉండదు..
హైదరాబాద్ ప్లేయర్ల దూకుడుకు విలువ ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ మారాలి. సమర్థవంతమైన ప్లేయర్లు ఆ జాబితాలో ఉండాలి. ఇలా వచ్చి అలా అవుట్ అయ్యే ప్లేయర్లను ఆ జాబితాలో చేర్చితే మాత్రం హైదరాబాద్ జట్టు 2026 లో కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించేది కష్టమే అవుతుంది. ఈ మాట అంటున్నది మేం కాదు.. హైదరాబాద్ అభిమానులు. ఇప్పటికైనా హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ సమస్యను గుర్తించి.. పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిందే.