Revanth Reddy controversy : రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు చేయడం సహజం. కొన్ని సంచలన ఆరోపణలు చేయడం కూడా సహజం. కానీ, తెర వెనుక జరిగే విషయాలను బయట పెడితే మాత్రం.. రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ దాదాపు సగం దశకు వచ్చినప్పటికీ ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. సన్న వడ్లకు బోనస్ మొన్న అంటే మొన్న వేశారు. రైతులు రైతు భరోసా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి 1000 కోట్లను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు పంపిద్దామని చెప్పడం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీ నేతలు అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మార్చారని ఆరోపిస్తున్నారు.
పదేపదే రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ హై కమాండ్ వద్దకు తెలంగాణ నాయకులు వెళ్లారు. ఆ సమయంలో 1000 కోట్ల గురించి ప్రస్తావన వచ్చిందని.. కేరళ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఖర్చుల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలని కాంగ్రెస్ పెద్దలు సూచించారని.. కేరళ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ ను నియమించామని.. తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్పినట్టు గులాబీ పార్టీ తన మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.
వాస్తవానికి దీనికి సరైన కౌంటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. దీంతో అందరూ అదే నిజమనే భావనతో ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నం అని అనుకున్నారు. రేవంత్ రెడ్డి మాటలతో ఆ వెయ్యి కోట్ల వ్యవహారం అబద్ధం కాదని.. కావాలని చేస్తున్న ప్రచారం అంతకంటే కాదని.. అది నిజమని తేలిపోయింది. ” గాంధీ కుటుంబానికి ఆర్దిక అవసరాలు ఉన్నాయని.. అందరం కలిసి తెలంగాణ నుంచి 1000కోట్ల రూపాయలు సమకూర్చి ఇవ్వగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉందని” రేవంత్ రెడ్డి అనడం సంచలనాన్ని కలిగిస్తోంది.
సాధారణంగా చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో పెద్దగా తప్పు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ఇస్తామని చెప్పిన డబ్బులు ప్రభుత్వం నుంచి కాదు.. కేవలం కార్యకర్తలం అందరం కలిసి డబ్బులు ఇస్తామని అన్నారు. విరాళాల రూపంలో కార్యకర్తలు ఇవ్వగలరు అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. కానీ ఈ మాట ఎందుకు దుమారమైందంటే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. గతంలో ఎన్నడు కూడా ఈ తరహాలో రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వ సొమ్ము 1000 కోట్లను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఇస్తున్నారని గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు “నన్ను కోసినా డబ్బులు లేవు” అని చెబుతూ, అదే సమయంలో తెలంగాణ నుండి ఏఐసీసీకి ₹1000 కోట్లు పంపగలమని గర్వంగా ప్రకటించడం విరుద్ధంగా కనిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో చెప్పినట్లే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మార్చిందనే… pic.twitter.com/UHNfVvhUbC
— Dr. Chinnamail Anji Reddy (@AnjiReddy_BJP) February 23, 2026